అగ్రరాజ్యం అమెరికా గగనతలంలో మరోసారి అనుమానాస్పద వస్తువు కదలికలు కలకలం సృష్టించాయి. అలస్కా ఉత్తర తీరంలో 40వేల అడుగుల ఎత్తులో పేలోడ్లతో ఉన్న ఓ వాహనం ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. వెంటనే యుద్ధవిమానంతో దాన్ని కూల్చేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారికంగా వెల్లడించింది. ఈ వస్తువు గురువారమే అమెరికా గగనతలంలోకి ప్రవేశించినట్లు పెంటగాన్ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ పాట్రిక్ రైడర్ తెలిపారు. పౌర విమానయాన రాకపోకలకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో శుక్రవారం మధ్యాహ్నం దాన్ని కూల్చేసినట్లు వెల్లడించారు. ఈ వాహనం గురించి అధ్యక్షుడు జో బైడెన్‌కు సమాచారం అందిన వెంటనే.. దాన్ని కూల్చివేయాలని మిలిటరీకి అధ్యక్షుడు ఆదేశాలిచ్చినట్లు వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.
గగనతలంలో మళ్లీ అనుమానస్పద వస్తువు.. 40వేల అడుగుల ఎత్తులో కూల్చేసిన అమెరికా
ఆరు రోజుల క్రితం తమ గగనతలంలో చైనా నిఘా బెలూన్‌ను కూల్చిన అమెరికా తాజాగా మరో వస్తువును నేలకూల్చింది. అలస్కా గగనతలంలో కారు పరిమాణంలో ఉన్న వస్తువును ఫైటర్‌జెట్‌తో కూల్చివేసినట్లు పెంటగాన్ తెలిపింది. అనుమానిత వస్తువు కూల్చివేత విజయవంతమైనట్లు బైడెన్ వెల్లడించారు.
40వేల అడుగుల ఎత్తులో ఎగురుతుండగా.. ఎఫ్-22 యుద్ధ విమానం ఎయిమ్-9ఎక్స్ క్షిపణితో ఆ వస్తువును కూల్చేసినట్లు పెంటగాన్ వెల్లడించింది. అయితే, ప్రస్తుతానికి ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలపై ఎలాంటి స్పష్టత లేదని పేర్కొంది. ఆ వస్తువు శకలాలను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ఉత్తర కమాండ్ ప్రక్రియ మొదలుపెట్టిందని పెంటగాన్ ప్రతినిధి పాట్రిక్ రైడర్ వెల్లడించారు.
ఇటీవల తమ గగనతలంలోకి వచ్చిన ఓ భారీ చైనా నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చేసింది. తాజాగా కన్పించిన వస్తువు.. ఓ చిన్న కారు అంత పరిమాణంలో ఉందని పాట్రిక్ తెలిపారు. నిఘా బెలూన్‌తో పోలిస్తే పరిమాణంలో ఇది చాలా చిన్నదని పేర్కొన్నారు. ఇటీవల కూల్చివేసిన చైనా బెలూన్ శకలాల నుంచి తాము అత్యంత కీలక సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడించారు. ఆ బెలూన్‌లో కమ్యూనికేషన్ సంకేతాలను సేకరించగలిగే పరికరాలు ఉన్నాయని తెలిపారు.