గగనతలంలో చక్కర్లు కొడుతూ తమ అణు స్థావరాలపై నిఘా పెట్టిన చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేసింది. దక్షిణ కరోలీనా తీరానికి దగ్గర్లో దాన్ని కూల్చేసినట్టు పెంటగాన్ తెలిపింది. అట్లాంటిక్ సముద్రంలో పడిపోయిన బెలూన్ శిథిలాలను, అందులోని పరికరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు.. శనివారం మధ్యాహ్నం కూల్చివేత ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపింది. వర్జీనియాలోని లాంగ్లే ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి బయల్దేరిన ఓ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్.. క్షిపణిని ప్రయోగించి బెలూన్‌ను కూల్చివేసింది.
అమెరికా గగనతలంలో సంచరిస్తున్న చైనా నిఘా బెలూన్ ఒక్కసారిగా కలకలం రేపింది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్ సంచరించడం వల్ల అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. మొత్తం వ్యవహారాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి పెంటగాన్ తీసుకెళ్లింది. మొదట ఆ బెలూన్‌ను కూల్చివేయడానికి అమెరికా కాస్త వెనకడుగు వేసినా.. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం ఆ చర్యను పూర్తి చేసింది. దక్షిణ కరోలీనా తీరానికి ఆరు కిలోమీటర్ల జరిగిన ఈ ఆపరేషన్‌లో ఏ అమెరికన్‌కూ హాని జరగలేదని స్పష్టం చేసింది. అమెరికా గగనతలంలోనే ఈ ఆపరేషన్ పూర్తైందని... తమ దేశ పరిధిలోని సముద్ర జలాల్లోనే శిథిలాలు పడిపోయాయని పెంటగాన్ వివరించింది. ఈ ఆపరేషన్‌కు కెనడా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందని తెలిపింది.
అప్పుడే కూల్చేయమని చెప్పా: బైడెన్
చైనా నిఘా బెలూన్ కూల్చివేతపై అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. "పెంటగాన్.. చైనా నిఘా బెలూన్ గురించి బుధవారం వివరించింది. అప్పుడే త్వరగా కూల్చివేయమని ఆదేశించాను. కానీ ఎవరికీ ఎటువంటి నష్టం జరగకుండా కూల్చివేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఆ పనిని శనివారం పూర్తిచేసింది" అని బైడెన్ చెప్పారు.