అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. లూయివిల్లోని ఓ బ్యాంకు భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు సైతం ఘటనలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో ఆరుగురికి గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈస్ట్ మెయిన్ స్ట్రీట్‌లోని ఓ భవనంలో కాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ భవనంలోనే ఓల్డ్ నేషనల్ బ్యాంక్ ఉందని చెప్పారు.
అంతకుముందు లూయివిల్ మెట్రో పోలీస్ శాఖ.. కాల్పుల ఘటనపై వెంటనే ప్రజలను అప్రమత్తం చేసింది. ఓల్డ్ నేషనల్ బ్యాంక్ ఉన్న భవనంలో కాల్పుల శబ్దాలు వినిపించాయని ట్వీట్ చేసింది. కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ప్రజలెవరూ ఆ చుట్టుపక్కలకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాకీ శబ్దాలు వినిపించగానే భవనం నుంచి బయటకు పరుగులు తీసినట్లు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకోగానే పెద్ద సంఖ్యలో పోలీసు వాహనాలు ఆ భవనం వద్దకు చేరుకున్నాయి. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సులో ఆస్పత్రులకు తరలించారు పోలీసులు.
ఘటనాస్థలిలో పోలీసు కార్లు, అంబులెన్సు ఎన్నో ఘటనలు..
అమెరికాలో తరచుగా కాల్పుల ఘటనలు జరుగుతుంటాయి. తుపాకీ లైసెన్సులపై నియంత్రణ లేకపోవడం వల్ల విచ్చలవిడిగా దుండగులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. చిన్నారులను లక్ష్యంగా చేసుకొని అనేక పాఠశాలలపై దాడులు జరిగాయి. ఇటీవలే సాయుధ మహిళ ఓ ప్రైవేటు పాఠశాలలోకి చొరబడి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అదే ఘటనలో మరో ముగ్గురు సైతం చనిపోయారు. పోలీసులు సమాచారం అందుకొని స్కూల్‌కు చేరుకున్నారు. అనంతరం ఆ మహిళపై ఎదురుకాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆమె మరణించింది.
పాఠశాలలో మొత్తం 12 నిమిషాల పాటు మారణహోమం సాగింది. పాఠశాలకు పక్కనే ఉన్న ఓ దారి నుంచి సాయుధ మహిళ లోపలికి ప్రవేశించింది. మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వెళ్లి చిన్నారులపై విచక్షణా రహితంగా కాల్పులు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తొలి అంతస్తులో ఉన్న వారందరినీ ఖాళీ చేయించారు. రెండో అంతస్తులో ఉన్న సాయుధ మహిళను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ చేపట్టారు. ఆమెను గుర్తించి కాల్పులు జరిపారు. దీంతో సాయుధురాలు ప్రాణాలు కోల్పోయింది.
అమెరికాలో ఈ తుపాకీ విష సంస్కృతిని రూపుమాపేందుకు కృషి చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ.. రాజకీయంగా దీనిపై గట్టి ప్రయత్నాలు జరగడం లేదు. ఈ విషయంపై రాజకీయ నాయకులు సైతం రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు వాదనలకు దిగుతున్నారు. సాధారణంగా డెమొక్రాట్లు తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుండగా.. రిపబ్లికన్లు మాత్రం గన్స్ వాడకాన్ని నియంత్రించవద్దని కోరుతున్నారు. సమస్య ఆయుధాల వల్ల కాదని.. వ్యక్తులే వాటిని దుర్వినియోగం చేస్తున్నారని వాదిస్తున్నారు.