Subway Shooting: అమెరికాలో గన్ కల్చర్ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. బ్రూక్లిన్‌లో రైలు ప్రయాణించే ఓ సబ్వేలో కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సబ్వే అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. ముసుగు ధరించిన వ్యక్తులు ఘటనాస్థలం నుంచి పారిపోయినట్లు వెల్లడించారు.
సబ్వేలో పొగలు కమ్ముకోగా.. పోలీసులు రంగంలోకి దిగారు. కాల్పుల కారణంగానే పొగలు వెలువడ్డాయని స్పష్టం చేశారు. కాల్పులతో నగరంలో రైలు ప్రయాణాలు ఆలస్యంగా మొదలయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సబ్వేలో యాక్టివ్ పేలుడు పదార్థాలను గుర్తించలేదని వెల్లడించారు. ఈ ఘటనతో సంబంధం ఉండొచ్చని భావిస్తోన్న వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు గుర్తించారు. అతడి ఫొటోను విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50వేల డాలర్ల నజరాన ప్రకటించారు. 62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్‌ను ఈ కేసులో 'పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా ప్రకటించారు. ఈ వ్యక్తి ఆరెంజ్ కలర్ కోటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. అతడు వాడినట్లు భావించిన యూ హౌల్ వ్యాన్ తాళాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.