అమెరికాలో తుపాకీ విష సంస్కృతికి మరో 10 మంది బలయ్యారు. చైనా నూతన సంవత్సరం వేడుకలు జరుగుతున్న లాస్ ఏంజిల్స్‌లోని మాంటెరీ పార్క్‌లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. శనివారం రాత్రి 10.22 నిమిషాలకు జరిగిందీ ఘటన.
దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో పది మంది గాయపడ్డారని చెప్పారు. ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. ఘటన తర్వాత దుండగుడు పారిపోయాడని వెల్లడించారు. సాయుధుడు కాల్పులు జరిపిన సమయంలో ఘటనాస్థలిలో వేలమంది ప్రజలు ఉన్నారని.. వీరందరూ చైనీయుల లూనార్ న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారని స్థానిక మీడియా వెల్లడించింది.
చైనీస్ న్యూఇయర్ పార్టీ వేళ దాడి.. 10 మంది మృతి - చైనా నూతన సంవత్సరం వేళ కాల్పులు
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. చైనా నూతన సంవత్సరం వేడుకలు జరుగుతున్న లాస్ ఏంజిల్స్‌లోని మాంటెరీ పార్క్‌లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
ఓ వ్యక్తి మెషీన్ గన్‌తో మాంటెరీ పార్క్‌కు వచ్చి కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఘటన జరిగిన వీధిలోనే సియాంగ్ వాన్ చాయి అనే వ్యక్తి బార్బెక్యూ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో రెస్టారెంట్లోకి వచ్చి తలుపులు వేసేశారని.. బయట ఓ వ్యక్తి గన్‌తో కాల్పులు జరుపుతున్నాడని వారు చెప్పినట్లు సియాంగ్ వెల్లడించాడు. ఆ సాయుధుడి వద్ద భారీగా మందుగుండు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సమీపంలోని డ్యాన్సింగ్ క్లబ్ లక్ష్యంగా నిందితుడు దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.