తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా సాయం.. పుతిన్‌ హెచ్చరికలు బేఖాతరు!

US Aid To Ukraine : రష్యా క్షిపణి దాడులతో అల్లాడిపోతోన్న ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు మరోసారి అండగా నిలుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా.. ఉక్రెయిన్‌కు మరోసారి ఆయుధ సాయం ప్రకటించింది.

US Aid To Ukraine
US Aid To Ukraine

By

Published : Oct 15, 2022, 2:22 PM IST

US Aid To Ukraine : కెర్చ్‌ వంతెన పేలుడు తర్వాత రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది. క్రెమ్లిన్ సేనల క్షిపణి దాడులు మళ్లీ పెరుగుతుండటం వల్ల ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు పశ్చిమ దేశాలు మళ్లీ ముందుకొచ్చాయి. ఇప్పటికే పలు దేశాలు కీవ్‌కు సాయం ప్రకటించగా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా మరోసారి భారీ మొత్తంలో ఆయుధాలను పంపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఉక్రెయిన్‌కు 725 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీ, ఇతర సైనిక సాయాన్ని ప్రకటించింది. పశ్చిమ దేశాల సాయంపై పుతిన్‌ హెచ్చరికలు చేస్తోన్న వేళ.. యూఎస్‌ ఈ సాయం ప్రకటించడం గమనార్హం.

కీవ్‌పై రష్యా క్షిపణి దాడుల నేపథ్యంలో నాటో దేశాలు శుక్రవారం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు (ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌) అందించాలని ఐరోపా సహా పలు దేశాల రక్షణ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమెరికా తాజా సైనిక సాయాన్ని ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజీలో ప్రధానంగా కొత్త ఆయుధాలేవీ లేవని అధికారులు తెలిపారు. గతంలో పంపిన ఆయుధాలే మళ్లీ పంపించనుంది. వీటితో పాటు ఉక్రెయిన్‌ ఆయుధ వ్యవస్థలకు అవసరమైన మందుగుండును పెద్ద మొత్తంలో పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.

కొత్త ప్యాకేజీలో హై మొబిలిటీ ఆర్టిలెరీ రాకెట్‌ సిస్టమ్స్‌ (హెచ్ఐఎంఏఆర్‌ఎస్‌) ఉంది. ఉక్రెయిన్‌ రష్యాను ఎదుర్కోవడంలో ఈ సిస్టమ్స్‌ కీలకంగా పనిచేస్తోంది. ఇప్పటికే అమెరికా 20 హెచ్‌ఐఎంఏఆర్‌ఎస్‌ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు అందించగా.. రానున్న రోజుల్లో మరో 18 వ్యవస్థలను ఇవ్వనుంది. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరఫరా చేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఫోన్‌లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు అమెరికా.. ఉక్రెయిన్‌కు 17.5 బిలియన్‌ డాలర్ల ఆయుధ సాయాన్ని ప్రకటించింది.

మరోవైపు ఉక్రెయిన్‌కు అడ్వాన్స్‌డ్‌ ఎన్‌ఏఎస్‌ఏఎం యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌తో క్షిపణులను అందిస్తామని బ్రిటన్‌ గతవారం ప్రకటించింది. వీటితో పాటు వందలాది డ్రోన్లు, 18 హొవిట్జర్‌ ఆర్టిలెరీ తుపాకులు కూడా పంపిస్తామని తెలిపింది. ఇక ఇప్పటికే జర్మనీ నాలుగు ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను అందించింది.

కాగా.. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల సాయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఆ దేశాలను కూడా యుద్ధంలో భాగస్వాములుగా పరిగణిస్తామని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక రష్యా సైన్యంతో నాటో బలగాలు నేరుగా తలపడితే మాత్రం అది 'ప్రపంచ విపత్తుకు' దారితీస్తుందని హెచ్చరించారు.

ఇవీ చదవండి:'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశం పాకిస్థాన్​'.. బైడెన్ ఫుల్​ ఫైర్​!

అణు ప్రయోగాలకు సిద్ధమైన నాటో.. రష్యాకు వెయ్యి కి.మీ దూరంలోనే!

ABOUT THE AUTHOR

...view details