రష్యా-ఉక్రెయిన్ యుద్దం మొదలై 10 నెలలు దాటింది. పుతిన్ బలగాల ధాటికి తొలినాళ్లలో కకావికలమైన జెలెన్‌స్కీ సేన క్రమంగా పుంజుకుంటోంది! ప్రత్యర్థి దాడులను తిప్పికొడుతూనే ఎదురుదాడులు కూడా చేపడుతోంది. అయితే ఆయుధ సంపత్తిలో ఉక్రెయిన్‌పై రష్యాది స్పష్టమైన పైచేయి. అందుకే తమకు ఆయుధాలు, ఇతర రక్షణ వ్యవస్థలను అందించాలంటూ అమెరికా సహా పశ్చిమ దేశాలను జెలెన్‌స్కీ పదేపదే కోరుతున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఇటీవల అమెరికాలో పర్యటించారు కూడా. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా తాజాగా తీపి కబురు అందించింది. ఆ దేశానికి దాదాపు రూ.13,500 కోట్ల సైనిక సాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా అత్యాధునిక పేట్రియాట్ క్షిపణి వ్యవస్థను అందించనున్నట్లు తెలిపింది. ప్రధానంగా రష్యా నుంచి దూసుకొస్తున్న డ్రోన్లను సమర్థంగా నిలువరించేందుకు ఈ రక్షణ వ్యవస్థ దోహదపడే అవకాశాలున్నాయి.
ఏమిటీ పేట్రియాట్?
పేట్రియాట్ అనేది 'ఫేజ్డ్ అర్రే ట్రాకింగ్ రాడార్ ఫర్ ఇంటర్‌సెప్ట్ ఆన్ టార్గెట్'కు సంక్షిప్త రూపం. ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించే రక్షణ వ్యవస్థ ఇది. శత్రు బలగాల నుంచి దూసుకొచ్చే క్షిపణులు/డ్రోన్లను అడ్డుకొని, వాటిని నిర్వీర్యం చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ప్రపంచంలోకెల్లా అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థల్లో ఇదొకటి. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకునేందుకు వీలుగా పలు వెసులుబాట్లు కల్పించారు.
ఏమేం ఉంటాయ్?
ఓ ట్రక్కు పైనుంచి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇందులో 8 లాంఛర్లు ఉంటాయి. ఒక్కో లాంఛర్‌లో గరిష్ఠంగా 4 క్షిపణి ఇంటర్‌సెప్టార్‌ల చొప్పున ఉంటాయి. వీటితోపాటు గ్రౌండ్ రాడార్, కంట్రోల్ స్టేషన్, జనరేటర్ కూడా ఈ క్షిపణి వ్యవస్థలో భాగమే. దీని నిర్వహణకు 90 మంది సిబ్బంది అవసరం.