లాస్ ఏంజెలెస్‌లో దుండగుడి కాల్పుల్లో 11 మంది మరణించిన దుర్ఘటన మరువకముందే అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. యూఎస్‌లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు దుర్ఘటనల్లో.. ఇద్దరు విద్యార్థులు సహా తొమ్మిది మంది మరణించారు.
ఉత్తర కాలిఫోర్నియా హాఫ్ మూన్ బేలోని రెండు ప్రాంతాలు తుపాకీ మోతలతో దద్దరిల్లాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మౌంటైన్ మష్రూమ్ ఫామ్ రైస్ టకింగ్ సోయిల్ ఫామ్‌లలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ దుర్ఘటనలపై స్పందించారు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్. లాస్ ఏంజెలెస్ విషాదం నుంచి తేరుకోకముందే.. ఇంకో విషాదం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ట్వీట్ చేశారు.
పాఠశాల విద్యార్థులపై కాల్పులు
డెస్ మొయిన్స్లోని ఓ పాఠశాలపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు మరణించగా.. ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.