తెలంగాణ

telangana

ETV Bharat / international

'అవును.. ఆ నేరాలన్నీ నేనే చేశా!'.. ఆరోపణలు అంగీకరించనున్న బైడెన్​ కుమారుడు - Son Hunter Biden illegally having weapon

అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నానని, పన్ను ఎగవేతకు పాల్పడ్డడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు అంగీకరించారు! దీనిపై హంటర్ బైడెన్​ న్యాయశాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కోర్టులో దాఖలైన లేఖ ఆధారంగా మంగళవారం ఈ విషయం వెల్లడైంది.

us-president-son-hunter-biden-pleads-guilty-to-tax-offenses-and-illegally-having-weapon
అమెరికా అధ్యక్షుడు కొడుకు హంటర్ బైడెన్

By

Published : Jun 20, 2023, 10:08 PM IST

Updated : Jun 21, 2023, 6:21 AM IST

పన్ను ఎగవేత, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి నేరాలు చేసినట్లు ఒప్పుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ సిద్ధమయ్యారు. తద్వారా ఈ కేసుల్లో జైలు శిక్షను తగ్గించుకోనున్నారు. ఈ మేరకు న్యాయశాఖతో హంటర్ బైడెన్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. డెలావేర్‌లోని యూస్​ జిల్లా కోర్టులో దాఖలైన లేఖ ఆధారంగా మంగళవారం ఈ విషయం వెల్లడైంది.

2018 అక్టోబరులో 11 రోజుల పాటు డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో పాటు.. కోల్ట్ కోబ్రా 38 స్పెషల్ అనే హ్యాండ్‌గన్‌ను కలిగి ఉన్నారనే అభియోగాలు హంటర్ బైడెన్​​పై ఉన్నాయి. ఈ లెక్కన హంటర్​ బైడన్​కు గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాకపోతే.. ఈ అభియోగాలపై బైడెన్​ ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్న నేపథ్యంలో శిక్ష ఎంత పడుతుందన్నది తెలియాల్సి ఉంది.

ఐదేళ్ల తరువాత ఇప్పుడు ఈ కేసు పరిష్కారం దిశగా వెళ్తోందని.. హంటర్​ తరపు న్యాయవాది క్రిస్టోఫర్ క్లార్క్ అన్నారు. అయితే 53 ఏళ్ల హంటర్ ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి ఫెడరల్​ న్యాయమూర్తి ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ విషయంలో కొన్నేళ్లుగా రిపబ్లికన్ చట్టసభ సభ్యుల నుంచి హంటర్ బైడెన్​ మాటల దాడి ఎదుర్కొంటున్నారు. కాగా కుమారుడి విషయంలో అధ్యక్షుడు జోబైడెన్​ కూడా ఈ విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది.

ల్యాప్​టాప్​ కేసులోనూ చిక్కులే..
ఈ రెండు కేసులతో పాటు హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​కు సంబంధించిన వివాదం సైతం అమెరికాలో చర్చనీయాంశంగా ఉంది. తన కుమారుడు హంటర్ బైడెన్​ అవినీతి ఆరోపణలపై ఉక్రెయిన్​లో విచారణ జరగకుండా.. ఉపాధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో జో బైడెన్ అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ఉక్రెయిన్​కు చెందిన ఓ కంపెనీ ప్రతినిధితో జో బైడెన్ భేటీ కూడా అయ్యారని న్యూయార్క్ పోస్ట్ గతంలో ఓ కథనంలో పేర్కొంది. జో బైడెన్​ను కలిసే అవకాశం ఇప్పించినందుకు సదరు కంపెనీ ప్రతినిధి హంటర్ బైడెన్​కు ఈమెయిల్ రాశారని కథనంలో వివరించింది. ఇందుకు సంబంధించిన మెయిళ్లు హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​లో లభ్యమయ్యాయని రాసుకొచ్చింది. దీన్ని డెమొక్రాట్లు ఖండిస్తున్నారు.

ఈ కథనాన్ని ట్విట్టర్​లో వైరల్ కాకుండా ఆ సంస్థ ఉద్యోగులు చర్యలు తీసుకున్నారని ఇటీవల బయటపడటం సంచలనం రేపింది. హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​ రహస్యాలపై న్యూయార్క్ పోస్ట్ రాసిన కథనాన్ని ట్విట్టర్ తాత్కాలికంగా నిషేధించినట్లు ఆ సంస్థ మాజీ ఉన్నత ఉద్యోగిని విజయ గద్దె కొద్ది నెలల క్రితం అంగీకరించారు. వెంటనే ఆ కథనాన్ని పునరుద్ధరించేలా ట్విట్టర్ చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని భావిస్తున్నట్లు గతంలో చెప్పుకొచ్చారు. అమెరికా చట్టసభ్యుల ముందు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. అయితే, ఆంక్షలు విధించడం వెనక ప్రభుత్వ హస్తమేమీ లేదని స్పష్టం చేశారు.

హంటర్ బైడెన్ ల్యాప్​టాప్ స్టోరీ విషయంపై 2020 ఎన్నికల సమయంలో జో బైడెన్ టీమ్​తో విజయ గద్దె జరిపినట్లు పేర్కొన్న సంభాషణలను ఇటీవల మస్క్ బయటపెట్టారు. ఓ స్వతంత్ర జర్నలిస్టు ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. 'హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​' అంశంపై సెన్సార్​షిప్ విధించడం వెనక విజయ గద్దె క్రియాశీలంగా పనిచేశారని స్వతంత్ర జర్నలిస్టు, రచయిత మాట్ తైబీ పేర్కొన్నారు.

Last Updated : Jun 21, 2023, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details