అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి దాదాపు ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బైడెన్ పోలాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అంతకుముందే ఉక్రెయిన్‌కు వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు 500 మిలియన్ డాలర్ల మిలిటరీ ప్యాకేజీని బైడెన్ ప్రకటించారు.
బైడెన్ పర్యటన సందర్భంగా శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. జెలెన్స్కీతో విస్తృత చర్చలు జరిపేందుకే ఈ పర్యటన చేపట్టినట్లు బైడెన్ పేర్కొన్నారని తెలిపింది. "ఏడాది క్రితం దురాక్రమణ ప్రారంభించినప్పుడు.. ఉక్రెయిన్ బలహీనమైన దేశమని పుతిన్ భావించారు. పశ్చిమ దేశాలు ఒకే అభిప్రాయంతో లేవని అనుకున్నారు. మాపై విజయం సాధించవచ్చని ఊహించారు. కానీ ఆయన పూర్తిగా తప్పు. యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచినా.. ఉక్రెయిన్ ఇంకా రష్యాకు అడ్డుగా నిలబడే ఉంది. ప్రజాస్వామ్యం పటిష్ఠంగా ఉంది" అని శ్వేతసౌధ ప్రకటనలో బైడెన్ పేర్కొన్నారు. అనంతరం కీవ్‌లో మాట్లాడిన బైడెన్.. ఉక్రెయిన్ కోసం మిలిటరీ సాయాన్ని ప్రకటించారు. కీలకమైన సైనిక పరికరాలు, ఆర్టిలరీ, ఆయుధ వ్యవస్థలు, నిఘా రాడార్లను అందించనున్నట్లు తెలిపారు. గగనతల దాడుల నుంచి ఉక్రెయిన్ ప్రజల రక్షణ కోసం ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందనే విషయాన్ని జో బైడెన్ పర్యటన సూచిస్తుందని జెలెన్స్కీ పేర్కొన్నారు.