తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​పై రష్యా ఎప్పటికీ గెలవలేదు.. వారికి అండగా ఉంటాం : బైడెన్​

ఉక్రెయిన్​పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. అమెరికా సహా మిత్రదేశాలు ఉక్రెయిన్‌ వెన్నంటే ఉంటాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఏడాది పూర్తైన నేపథ్యంలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

US President Joe Biden on Russia Ukraine war
పోలెండ్​లో అమెరికా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

By

Published : Feb 22, 2023, 10:49 AM IST

Updated : Feb 22, 2023, 11:20 AM IST

అమెరికా సహా మిత్రదేశాలు ఉక్రెయిన్‌ వెన్నంటే ఉంటాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఉక్రెయిన్​పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని ఆయన తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఏడాది పూర్తైన నేపథ్యంలో బైడెన్‌ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే పాశ్చాత్య సంకల్పాన్ని ఈ యుద్ధం కఠినతరం చేసిందని బైడెన్‌ అన్నారు. పోలాండ్​ వార్సాలోని ప్రఖ్యాత రాయల్‌ క్యాసిల్‌ వేదికగా పౌరులు, ఉక్రెయిన్‌ శరణార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్యాలు నేటికి, రేపటికి, ఎప్పటికీ స్వేచ్ఛకు రక్షణగా నిలుస్తాయని బైడెన్ ఉద్ఘాటించారు.

కీవ్​లో ఆకస్మికంగా పర్యటించిన ఆయన.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయిన మరుసటి రోజే బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కీవ్ బలంగా, గర్వంగా ఉందని బైడెన్ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద యుద్ధం ఉక్రెయిన్​లో ప్రారంభమైందని అన్నారు. ఇప్పటికే ఈ భయంకర యుద్ధంలో 10,000 మందికి పైగా మృతి చెందారని బైడెన్ వివరించారు. దీంతోపాటు ఈ యుద్ధం ఉక్రెయిన్​లో మౌలిక సదుపాయాలు దెబ్బతీయటమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రష్యాపై దాడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు కుట్ర పన్నాయంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ ఖండించారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని.. రష్యా పౌరులు తమకు శత్రువులు కాదని అన్నారు. దీంతోపాటు ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర విషాదకరమైనదని, అలాంటి యుద్ధాన్ని పుతిన్ ఎంచుకున్నాడని బైడెన్ చెప్పారు. పుతిన్ ఒక్క మాటతో ఈ యుద్ధాన్ని ముగించగలరని ఆయన తెలిపారు.

ఉక్రెయిన్ పర్యటన ముగించుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం పోలాండ్​కు చేరుకున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు అండ్రెజ్​ డుడాతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఉక్రెయిన్​- రష్యా యుద్ధంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. అమెరికాతో ఉన్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు.

Last Updated : Feb 22, 2023, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details