తెలంగాణ

telangana

ETV Bharat / international

జూన్​లో అమెరికా పర్యటనకు మోదీ.. డిన్నర్ పార్టీ ఇవ్వనున్న బైడెన్​ - 2023 modi biden meet

వచ్చే నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడన్​తో మోదీ అధికారికంగా సమావేశం కానున్నారని వైట్​ హౌస్​ వెల్లడించింది.

white house latest news on modi america tour
white house latest news on modi america tour

By

Published : May 10, 2023, 7:20 PM IST

Updated : May 10, 2023, 7:42 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్​లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్​తో జూన్​ 22న మోదీ సమావేశమవుతారని అమెరికా అధ్యక్ష భవనం వైట్​ హౌస్​ బుధవారం పేర్కొంది. ఈ అధికారిక పర్యటనకు సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సమావేశంలో ఇరువురి మధ్య కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీకి.. బైడెన్ అధికారికంగా డిన్నర్ పార్టీ ఇస్తారని వైట్​ హౌస్ వివరించింది. అమెరికా, భారత్ మధ్య ఉన్న లోతైన, బలమైన భాగస్వామ్యానికి మోదీ పర్యటన అద్దం పడుతుందని శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్ పియర్ పేర్కొన్నారు.

"సాంకేతికత రంగంలో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం సహా రక్షణ, శుద్ధ ఇంధనం, అంతరిక్షం రంగాలపై ఇద్దరు నేతలు చర్చలు జరపనున్నారు. ఇరుదేశ ప్రజల మధ్య సంబంధాలతో పాటు విద్యారంగంలో భాగస్వామ్యంపై చర్చిస్తారు. ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన వాతావరణ మార్పులు, ఆరోగ్య భద్రత అంశాలపై సమాలోచనలు జరుపుతారు. స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్​ అంశంలో ఇరుదేశాల ఉమ్మడి లక్ష్యాలను మోదీ పర్యటన మరింత పటిష్ఠం చేస్తుంది."
-కెరీన్ జీన్ పియర్, శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ

జీ20 కూటమికి ఈ ఏడాది భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్​లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు రావాలని బైడెన్​ను మోదీ అధికారికంగా కోరే అవకాశం ఉంది. చివరిసారి 2021 సెప్టెంబర్​లో అమెరికాలో మోదీ పర్యటించారు. బైడెన్ ఆహ్వానం మేరకు వాషింగ్టన్​ వెళ్లిన మోదీ... క్వాడ్ దేశాధినేతల సదస్సుకు హాజరయ్యారు.

ఈ ఏడాది మే 24న క్వాడ్ దేశాధినేతల సదస్సు జరగనుంది. సిడ్నీలో జరగనున్న ఈ సమావేశానికి మోదీ, బైడెన్​తో పాటు జపాన్ ప్రధాని కిషిద ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్​లో యుద్ధం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై క్వాడ్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు.. జపాన్​లోనూ పర్యటిస్తారని సమాచారం. జీ7 దేశాల వార్షిక సదస్సు కోసం మోదీ.. హిరోషిమాకు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మే 19 నుంచి 21 మధ్య జీ7 సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్.. జీ7 సదస్సుతో పాటు క్వాడ్ సమావేశం కోసం ఆసియా పర్యటన చేపట్టనున్నారు.

గతేడాది నవంబర్​లోనూ మోదీ, బైడెన్ కలుసుకున్నారు. ఇండోనేసియా బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ఇరువురూ భేటీ అయ్యారు. అంతకుముందు 2022 జూన్​లో వీరిద్దరూ కలిశారు. జర్మనీలో జరిగిన జీ7 సదస్సులో బైడెన్​తో మోదీ భేటీ అయ్యారు. అదే ఏడాది మేలో టోక్యోలో జరిగిన క్వాడ్ దేశాధినేతల సదస్సులో ఇరువురూ పాల్గొన్నారు.

Last Updated : May 10, 2023, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details