అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి తలపడనున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 2024లో జరగబోయే అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో తాను డెమొక్రటిక్ పార్టీ తరఫున మరోసారి పోటీ చేయబోతున్నట్లు బైడెన్ వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనను మళ్లీ.. అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని అమెరికన్లకు బైడెన్ పిలుపునిచ్చారు. ప్రతి తరం ప్రజాస్వామ్యం కోసం నిలబడాల్సిన క్షణం ఆసన్నమైందన్నారు. ప్రాథమిక స్వేచ్ఛ కోసం అందరూ ఐక్యంగా ఉంటారని నమ్ముతున్నానని.. 81 ఏళ్ల బైడెన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారు. తాజాగా బైడెన్ చేసిన ప్రకటనతో 2020లో పోటీ చేసిన ఇద్దరు వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష పీఠం కోసం బరిలో దిగుతునట్లు తెలుస్తోంది.
మంగళవారం ఎన్నికల సన్నాహాలు ప్రారంభించిన బైడెన్.. తాను వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నట్లు ఓ మూడు నిమిషాల ప్రచార వీడియోను విడుదల చేశారు. తనను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికోవాలంటూ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో అబార్షన్ హక్కులు, ప్రజాస్వామ్య రక్షణ, ఓటింగ్ హక్కులు సామాజిక భద్రతా వంటి అంశాలు.. 2024 ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన సమస్యలని బైడెన్ అన్నారు.
"ప్రతి తరం.. ప్రజాస్వామ్యం కోసం నిలబడాల్సిన క్షణం ఉంటుంది. వారంతా ప్రాథమిక స్వేచ్ఛ కోసం నిలబడాలి. ఇదంతా మనది అని నేను నమ్ముతాను. అందుకే నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక కోసం పోటీ చేస్తున్నాను. మాతో చేరండి. పని పూర్తి చేద్దాం."