US On Pakistan Church Attack :పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఐదు చర్చిలపై దాడి జరిగిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై విచారణ జరిపి.. శాంతియుత భావప్రకటనా స్పేచ్ఛకు మద్దతివ్వాలని పాకిస్థాన్ అధికారులను కోరింది. హింస, బెదిరింపులకు పాల్పడడం ఎప్పటికీ ఆమోదయోగ్యమైన వ్యక్తీకరణ కాదని తెలిపింది.
'శాంతియుత భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్నాం'
Church Burning Pakistan US Responds : "ఖురాన్‌ను అవమానించారన్న ఆరోపణలతో పాకిస్థాన్ చర్చిలపై దాడులు జరిగిన ఘటనపై ఆందోళన చెందుతున్నాం. మేం శాంతియుత భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్నాం. మతపరమైన ప్రేరేపిత హింసాత్మక ఘటనల పట్ల ఎల్లప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపాలని పాక్ అధికారులను కోరుతున్నాం" అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.
అయితే చర్చిలపై దాడి జరిగినప్పుడు.. పోలీసులు మౌనంగా ఉండిపోయారని క్రైస్తవ నాయకులు ఆరోపించారు. క్రిస్టియన్లను హింసిస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని పాకిస్థాన్ చర్చ్ ప్రెసిడెంట్ బిషప్ ఆజాద్ మార్షల్ ఆరోపణలు చేశారు. తమపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. మైనారిటీలపై దాడులకు దిగేవారినీ, చట్టాన్ని ఉల్లంఘించేవారిని కఠినంగా శిక్షిస్తామని పాక్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వరుల్ హక్ కాకర్ హెచ్చరించారు.