పాకిస్థాన్ నుంచి కవ్వింపులు ఎదురైతే భారత్ సైనిక చర్యతోనే సమాధానం ఇచ్చే అవకాశం ప్రస్తుతం అధికంగా ఉందని అమెరికా పేర్కొంది. గతంతో పోలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ తరహా దృక్ఫథం బలంగా ఉందని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తన నివేదికలో పేర్కొంది. భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తే ఘర్షణ అత్యంత ఆందోళనకరమని నివేదిక అభిప్రాయం వ్యక్తం చేసింది. రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్న నేపథ్యంలో.. ఎలాంటి ఘర్షణ అయినా ఆందోళనకర పరిస్థితులకు దారి తీయొచ్చని పేర్కొంది. అదే సమయంలో ఉగ్రవాదులకు పాకిస్థాన్ అంటకాగుతోందని కుండబద్దలు కొట్టింది.
"భారత వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇచ్చిన సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్‌కు ఉంది. ఆ దేశం నుంచి ఏదైనా ముప్పు ఎదురైతే.. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్.. సైనిక చర్యతో సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సమస్యపై ఇరు వర్గాల దృష్టి కోణం వల్ల ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చుతోంది. కశ్మీర్లో హింసాత్మక ఘర్షణలు, భారత్‌లో ఉగ్రవాదుల దాడులు వంటివి సమస్యలుగా ఉన్నాయి. 2021 ప్రారంభంలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ప్రకటించిన ఈ దేశాలు.. ఇదే శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది."
-అమెరికా నిఘా సంస్థ నివేదిక