Donald Trump indicted : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీచేసేందుకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రహస్యపత్రాల కేసులో ఆయనపై ఏడు అభియోగాలు నమోదయ్యాయి. అవినీతిలో కూరుకుపోయిన బైడెన్ ప్రభుత్వం.. తనపై అభియోగాలు మోపినట్లు తన న్యాయవాదికి సమాచారం ఇచ్చిందని, అంతా బూటకమని ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా చరిత్రలోనే మొదటిసారి మాజీ అధ్యక్షుడు, కమాండర్-ఇన్-చీఫ్ అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. వచ్చే మంగళవారం మియామి కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ అయినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడికి ఇలా జరుగుతుందని తాను అనుకోలేదన్నారు.
ట్రంప్ చేసిన ప్రకటనపై న్యాయశాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగా ఉంచుకోవటం, తప్పుడు ప్రకటనలు చేయడం, న్యాయాన్ని అడ్డుకోవడం వంటి ఏడు అభియోగాలు.. తన క్లయింట్ ట్రంప్‌పై నమోదైనట్లు ఆయన తరఫు న్యాయవాది జిమ్ ట్రస్టీ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు.
ఇదీ కేసు...
2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌కు తరలించినట్లు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, శ్వేతసౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడం వల్ల ఆ హడావుడిలో పత్రాలు వచ్చి ఉంటాయని అప్పట్లో ట్రంప్ కార్యాలయం ప్రకటించింది. అయితే, ఆ పత్రాలను తిరిగి తీసుకునేందుకు నేషనల్ ఆర్కైవ్స్, రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నించగా... ట్రంప్ అడ్డుకున్నారు.
పెట్టెల నిండా పత్రాలు..
ఈ క్రమంలోనే గతేడాది జనవరిలో ఎఫ్‌బీఐ అధికారులు ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు నిర్వహించగా... 15 బాక్సుల్లో 184 పత్రాలు లభించాయి. అందులో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్లు సమాచారం. రహస్య పత్రాలను ట్రంప్ తన ఇంట్లో ఇతరపత్రాలతో కలిపి ఉంచినట్లు తెలిసింది. ఒక్కో బాక్సుల్లో రహస్య పత్రాలతో పాటు వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, ఫొటోలు, వివిధ రకాల ప్రింట్ అవుట్లు, వ్యక్తిగత పత్రాలు కలిపి ఉన్నట్లు తేలింది. ఆగస్టులోనూ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఎఫ్‌బీఐ మరోసారి ట్రంప్ ఎస్టేట్‌పై దాడి చేసి 20 పెట్టెల నిండా పత్రాలను స్వాధీనం చేసుకుంది.
ఎన్నికల వేళ...
తనపై నమోదైన అభియోగాల గురించి ట్రంప్ స్వయంగా ట్రూత్ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తాను అమాయకుడినని, కుట్రపూరితంగానే తనపై ఈ అభియోగాలు మోపినట్లు ఆరోపించారు. ఎన్నికల్లో తనను అడ్డుకునేందుకు డెమోక్రాట్లు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. అమెరికా చరిత్రలోనే ఓ సిట్టింగ్ లేదా మాజీ అధ్యక్షుడిపై నేరాభియోగాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ట్రంప్ దోషిగా తేలితే సుదీర్ఘకాలం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వ పోటీలో ముందంజలో ఉన్న ట్రంప్... ఈ కేసు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అయితే, ఈ అభియోగాలు ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది తెలియరాలేదు.