US earthquake today : అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. అలాస్కా ద్వీపకల్పంలో శనివారం రాత్రి 10:48 గంటలకు భూమి కంపించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్లు వెల్లడించింది. అలాస్కాలోని సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 106 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భూకంపంధాటికి అలాస్కా ద్వీపకల్పంతోపాటు అలూటియన్ దీవులు, కుక్ ఇన్లెట్ ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఘటనలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఎటువంటి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
విపత్తు తీవ్రత భారీగానే ఉందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ తెలిపింది. కొడియాక్, అలాస్కా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. దీంతో అక్కడి ప్రజలందరిని రాత్రికి రాత్రే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కాసేపటి తర్వాత సునామీ హెచ్చరికలు ఉపసంహరించుకుంది వాతావరణ శాఖ. మరోవైపు షిషల్డిన్ అగ్నిపర్వతం బద్ధలయ్యే అవకాశాలున్నట్లు అలాస్కా వల్కనో అబ్జర్వేటరీ హెచ్చరించింది. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద వెదజల్లినట్లు పేర్కొంది. ఇప్పుడే భూకంపం ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని అత్యవసర విభాగం స్థానికులకు సూచించింది. అధికారుల సమ్మతితోనే తిరిగి అక్కడికి వెళ్లాలని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ద్వీపాలకు ఎటువంటి ముప్పులేదని తెలిపిన అధికారులు.. ఇప్పటికీ సముద్రంలో స్వల్ప మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.