Ukraine Crisis: 'పుతిన్ అధికారంలో కొనసాగకూడదు' అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పోలాండ్ రాజధాని వార్సోలో చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రష్యా లో అధికార మార్పిడి జరగాలని అమెరికా కోరుకుంటోందన్న వాదనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వెంటనే శ్వేతసౌధం రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టింది. రష్యాలో అధికార మార్పిడి చేయాలని బైడెన్ పిలుపునివ్వలేదని వివరణ ఇచ్చింది. పొరుగువారిపై పుతిన్ పెత్తనం చేయడాన్ని అనుమతించకూడదని దాని అర్థమని పేర్కొంది.
తొలుత బైడెన్ చేసిన ప్రకటన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి పెంచి మరింత కఠిన నిర్ణయాలు తీసుకొనేలా చేస్తుందని శ్వేతసౌధం అంచనావేసింది. వెంటనే బైడెన్ ప్రకటనపై వివరణ ఇచ్చుకొంది. బైడెన్ కోసం శ్వేత సౌధం సిద్ధం చేసిన ప్రకటనలో ఈ అంశాలు లేవు. కానీ, బైడెన్ ఈ ప్రకటన చేయడంపై అధికారులు కూడా ఆశ్చర్యపోయినట్లు సీఎన్‌ఎన్ కథనం పేర్కొంది. మరోపక్క బైడెన్ ప్రకటనపై క్రెమ్లిన్ మండిపడింది. తమ దేశ అధ్యక్షుడుగా ఎవరు ఉండాలనేది బైడెన్ నిర్ణయించరని.. రష్యా ప్రజలు ఎన్నుకొంటారని పేర్కొంది.