US Cop Laughing : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన ఘటనపై... సమగ్ర దర్యాప్తు చేపడతామంటూ హామీ ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టి.. కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భారత రాయబారి కోరిన వెంటనే.. ఈ ఘటనపై చర్యలు చేపట్టింది అగ్రరాజ్యం. మరోవైపు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై సైతం తీవ్రంగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తును సియాటిల్, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు తాము నిశితంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు.
US Cop Caught On Tape Laughing Telugu Student Death : అంతకుముందు సియాటిల్ పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియోపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలపై వెంటనే దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ట్వీట్ చేసింది. మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని.. సియాటిల్ అలాగే వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని భారత రాయభార కార్యాలయం పోస్ట్ చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశామని... అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది.
'జస్టిస్ ఫర్ జాహ్నవి'.. ట్రెండింగ్
మరోవైపు జాహ్నవికి న్యాయం చేయాలంటూ ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్(ప్రస్తుతం ఎక్స్)లో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 'జస్టిస్ ఫర్ జాహ్నవి' అనే హ్యాష్ ట్యాగ్‌తో పలువురు ట్వీట్లు చేస్తున్నారు. నిందితుడైన పోలీస్ అధికారిని కఠినంగా శిక్షించాలంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు.