US Cop Caught On Tape Laughing Telugu Student Death :అమెరికాలో కొందరు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఓ నల్లజాతీయుడి పట్ల అమానవీయంగా వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు యువతి ప్రాణాలకు విలువ లేదంటూ మరో అమెరికా పోలీసు తన అహంకారాన్ని బయటపెట్టుకున్నాడు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ చేసిన ఈ వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయంటూ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
US Cop Indian Student : కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి డిగ్రీ తర్వాత పై చదువుల కోసం 2021 సెప్టెంబరు 20న అమెరికా వెళ్లింది. సియాటెల్‌లో ఉంటున్న ఆమె.. ఈ జనవరిలో కళాశాలకు వెళ్లి వస్తుండగా రహదారి దాటుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో జాహ్నవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న దృశ్యాల్లో పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడటం వినిపించింది. ఆ ఘటన గురించి సహచరుడికి వివరిస్తూ.. జోకులు వేసుకుంటూ, నవ్వుతూ మాట్లాడారు. ఆ మాటలన్నీ అతడి బాడీకామ్లో రికార్డయ్యాయి. ఆమె ఒక సాధారణ వ్యక్తి అని, ఈ మరణానికి విలువ లేనట్టుగా మాట్లాడారు. ఆ సమయంలో పగలబడి నవ్వారు.
బాడీకామ్ వీడియోలో రికార్డైన ప్రకారం డేనియల్ అడెరెర్ మాటలు ఇలా ఉన్నాయి.
"ఆయన (పోలీసు వాహనం డ్రైవర్) 50మీద వెళుతున్నారు. అది అతివేగం ఏమీ కాదు. నిర్లక్ష్యంగా కూడా వాహనం నడపడం లేదు. ఆయన నిపుణుడైన డ్రైవర్. ఆమె రోడ్డు దాటుతోందని చెప్పాడు. అలాంటిదేమీ లేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. రోడ్డుకు 40 అడుగుల దూరంలో ఉందన్నారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. ఆమె రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టిందని అనిపిస్తోంది. తర్వాత డ్రైవర్ కారును వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఆమె చనిపోయింది. ఆమె ఓ సాధారణ వ్యక్తి. రూ.11వేల డాలర్లు. ఆమె వయసు 26 ఉంటుంది. ఆమె విలువ తక్కువే ఉంది."
-డేనియల్ అడెరెర్, సియాటిల్ పోలీసు అధికారి