అమెరికాలో ఉద్యోగం చేయాలని చూస్తున్న వారికి శుభవార్త. టూరిస్ట్ వీసా లేదా బిజినెస్ వీసాపై తమ దేశానికి వచ్చిన వారు కూడా.. అక్కడ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఇందుకు సంబంధించిన నిబంధనలపై అమెరికా పౌరసత్వం, వలసదారుల సేవల సంస్థ- యూఎస్సీఐఎస్ బుధవారం స్పష్టత ఇచ్చింది. అయితే.. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరేలోగా వారి వీసా స్టేటస్ మారేలా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది.
సాధారణంగా బీ1/బీ2 వీసాలను టూరిస్ట్, వ్యాపార పర్యటనలకు వెళ్లేవారికి అమెరికా జారీ చేస్తుంది. అయితే ఈ వీసాపై యూఎస్ వెళ్లినవారికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. అనంతరం వారు దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
టెక్ అగ్ర సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్ , అమెజాన్ వంటి సంస్థల్లో ఇటీవల కాలంలో తొలగింపుల కారణంగా అమెరికాలో భారత్ సహా విదేశాలకు చెందిన నైపుణ్యం కలిగిన వేలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. లేఆఫ్ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న వారు 60 రోజుల వ్యవధిలో మరో ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. వీరు అప్పటికి ఉద్యోగం సంపాదిస్తే అమెరికాలో ఉండవచ్చు. లేదంటే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ఆందోళనల నడుమ.. ఉద్యోగం వెతుక్కునేందుకు వేర్వేరు మార్గాలు ఉన్నాయంటూ బుధవారం టూరిస్ట్, బిజినెస్ వీసాలకు సంబంధించి యూఎస్సీఐఎస్ వరుస ట్వీట్లు చేసింది.