US Attack on Houthi Rebels :ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్‌పై అమెరికా, బ్రిటన్ సైన్యాలు గురువారం భారీ దాడులు చేశాయి. ఈ దాడిలో యెమెన్ హౌతీ రెబెల్స్‌కు చెందిన ఐదుగురు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. యెమెన్‌లో హౌతీల అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై ఇరు దేశాలు బాంబుల వర్షం కురిపించాయి. యుద్ధనౌక నుంచి టొమాహాక్ క్షిపణులతో పాటు యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధ భాండాగారాలు, లాజిస్టిక్ కేంద్రాలు, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేశామని అమెరికా అధికారులు చెప్పారు.
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని గత కొన్ని నెలలుగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని ఆపాలని వారం క్రితం అమెరికా సహా పలు దేశాలు హౌతీలను తీవ్ర స్థాయిలో హెచ్చరించాయి. లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పాయి. అయినా హౌతీలు సంయమనం పాటించకుండా దాడులను కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన అమెరికా తాజాగా ప్రతీకార దాడులను చేపట్టింది. ఈ దాడుల్లో బ్రిటన్ సైన్యం నేరుగా పాల్గొనగా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ తమకు మద్దతిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.
"ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛపై హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. అందుకోసం వారు ఉపయోగించిన యెమెన్‌లోని అనేక స్థావరాలపై విజయవంతంగా దాడి చేశాం. మా ప్రజలు, అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛా రవాణాను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోం."
--జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు