US Aid To Gaza : ఇజ్రాయెల్ సైన్యం-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరుతో గాజా ప్రాంతంలో తీవ్ర మానవతా సంక్షోభం తలెత్తింది. తినడానికి తిండి, తాగేందుకు నీరు సైతం లేక గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనా ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో భేటీ తర్వాత.. బైడెన్ ఈ ప్రకటన చేశారు.
10లక్షల మందికి పైగా ప్రజలకు..
America Aid To Gaza :ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర పోరు నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన 10 లక్షల మందికి పైగా ప్రజలకు, యుద్ధ ప్రభావిత పాలస్తీనియన్లకు తాము చేసిన ఈ సాయం ఉపయోగపడుతుందని బైడెన్ పేర్కొన్నారు. హమాస్ లేదా ఇతర తీవ్రవాద సంస్థలకు కాకుండా అవసరమైన ప్రజలకు ఈ సాయం చేరేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇజ్రాయెల్‌కు అండగా..
Biden Israel Visit :అయితే తాను ఒక సందేశంతోనే ఇజ్రాయెల్‌కు వెళ్లానని.. ఆ దేశం ఒంటరి కాదంటూ అంతకుముందు మరో ట్వీట్ చేశారు. అమెరికా ఉన్నంత కాలం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. మెజారిటీ పాలస్తీనా ప్రజలకు హమాస్‌తో అసలు సంబంధం లేదని పేర్కొన్నారు. గాజా ఆస్పత్రిపై జరిగిన దాడికి కారణం ఇజ్రాయెల్ సైన్యం కాదని తెలుస్తోందని అన్నారు.
మలాలా రూ.2.5 కోట్ల సాయం
Malala Aid To Gaza : గాజా ఆస్పత్రిపై రాకెట్ దాడి జరగడం పట్ల నోబెల్ పురస్కార గ్రహీత మలాలా విచారం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా రూ.2.5 కోట్ల సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "గాజాలోని అల్-అహ్లి ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిని చూసి నేను భయపడ్డాను. ఆ చర్యను నిస్సందేహంగా ఖండిస్తున్నాను. ఇజ్రాయెల్, పాలస్తీనా, ప్రపంచవ్యాప్తంగా శాంతినెలకొనాలని కోరుకుంటున్న ప్రజలతో నేనూ గొంతు కలుపుతున్నాను. సామూహిక శిక్ష పరిష్కారం కాదు. గాజాలోని నివసిస్తున్న జనాభాలో సగం మంది 18 సంవత్సరాలలోపు వయసున్న వారే. వారు తమ జీవితాంతం బాంబు దాడుల మధ్య ఉండకూడదు" అని మలాలా తెలిపారు.