పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ ఉగ్రవాదిపై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనకు మోకాలడ్డింది చైనా. 1999లో కాందహార్ హైజాక్, 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్‌కోట్ ఉగ్రదాడి సహా మరెన్నో ఘాతుకాలకు సూత్రధారి, పాత్రధారి అయిన అబ్దుల్ రౌఫ్ అజార్‌కు అనుకూలంగా వ్యవహరించింది. 15 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 14 దేశాలు ఆంక్షలు విధించేందుకు అంగీకారం తెలపగా.. శాశ్వత వీటో అధికారమున్న చైనా మాత్రం అందుకు భిన్న వాదన వినిపించింది. ఆంక్షల ప్రతిపాదన అమలు వాయిదా పడేలా చేసింది.
ఐరాస వేదికగా చైనా 'ఉగ్ర' కుట్రలు.. మసూద్ అజార్ సోదరుడికి అండ!
UNSC China India : పాకిస్థాన్ కోసం మరోమారు ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించింది చైనా. జైషే మహ్మద్ ముష్కరుడిపై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసి, ఆంక్షలు విధించాలన్న భారత్, అమెరికా ప్రయత్నాలకు మోకాలడ్డింది. ఆంక్షలు విధించేందుకు ఐరాస భద్రతా మండలిలోని 14 దేశాలు అంగీకరించినా.. చైనా మాత్రం ఈ ప్రతిపాదన అమలు వాయిదా పడేలా చేసింది.
అబ్దుల్ రౌఫ్ అజార్.. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ సోదరుడు. ఆ సంస్థకు డిప్యూటీ చీఫ్. అబ్దుల్‌ను 2010లోనే ఆంక్షల జాబితాలో చేర్చింది అమెరికా. భారత్‌పై ఉగ్రదాడులకు పాల్పడేలా పాకిస్థానీల్ని అతడు రెచ్చగొడుతున్నాడని అగ్రరాజ్యం తేల్చింది. అయితే.. ఇది సరిపోదని, అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్, అమెరికా భావించాయి. అతడి అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాలని, ఆస్తులు జప్తు చేయాలని ప్రతిపాదించాయి. ఈ ఆంక్షలు అమల్లోకి రావాలంటే ఐరాస భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలు అంగీకరించాల్సి ఉండగా.. చైనా మాత్రం అడ్డుకుంది. ఈ కేసుపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని, ఇలా ప్రతిపాదనల్ని పక్కనబెట్టడం కొత్తేమీ కాదని తన వైఖరిని సమర్థించుకుంది.
ఐరాసలో భారత శాశ్వత రాయబారి అయిన రుచిరా కాంబోజ్.. చైనా వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. పూర్తిస్థాయి సాక్ష్యాధారాలు ఉన్నా.. కరడుగట్టిన ఉగ్రవాదులకు సంబంధించిన ప్రతిపాదనల్ని పక్కనబెట్టడం దురదృష్టకరమన్నారు. పదేపదే ద్వంద్వ వైఖరి అవలంబించడం, రాజకీయాలు చేయడం.. ఆంక్షల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం, విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని చైనాపై మండిపడ్డారు రుచిరా.
పాక్ ఉగ్రవాదులకు అనుకూలంగా ఐరాస భద్రతా మండలిలో చైనా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. అబ్దుల్ రెహ్మాన్ మక్కీ సహా మరికొందరు ముష్కరులపై ఆంక్షలు విధించకుండా బీజింగ్ అడ్డుపడింది.