అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. తాజాగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు బలయ్యారు. ఐదుగురు గాయపడ్డారు. మిచిగాన్ రాష్ట్రం ఈస్ట్ లాన్సింగ్‌లో ఉన్న మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
యూనివర్సిటీలో రెచ్చిపోయిన దుండగుడు.. కాల్పుల్లో ముగ్గురు మృతి - gun fire in usa
అమెరికా మరోసారి కాల్పులు జరిగాయి. సోమవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఎనిమిదిన్నరకు యూనివర్సిటీలోని బెర్కే హాల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. స్టూడెంట్ యూనియన్ భవనం వద్ద కూడా కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు. ఎర్రని బూట్లు, జీన్ జాకెట్, టోపీ, మాస్క్ ధరించిన పొట్టిగా ఉన్న ధరించిన నల్ల జాతి వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి ఈ కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మిచిగాన్ వర్సిటీ క్యాంపస్‌ను పోలీసులు చుట్టుముట్టారు. విద్యార్థులను లోపలే సురక్షిత స్థానాల్లో ఉండమని సూచించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
క్షతగాత్రులను స్థానికంగా ఉన్న స్పారో ఆసుపత్రికి తరలించారు. క్యాంపస్‌లోని విద్యార్థులందరికీ భద్రత కల్పించడానికి చేయగలిగినదంతా చేస్తున్నామని క్యాంపస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ చీఫ్ క్రిస్ రోజ్‌మాన్ చెప్పారు. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో దాదాపు 50 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో 48 గంటల పాటు అన్ని కార్యకలాపాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.