ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలకాలని, వెంటనే రష్యా బలగాలు అక్కడి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. 193 సభ్యదేశాలు ఉన్న జనరల్ అసెంబ్లీలో.. 141 దేశాలు తీర్మానానికి అనుకూలంగానూ, 7 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్, చైనా సహా మరో 30 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రసంగించిన చైనా రాయబారి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగేందుకు తాము మద్ధతునిస్తామని పేర్కొన్నారు. ఈ యుద్ధం విషయంలో బాధ్యుడిని, బాధితుడిని సమానంగా చూడలేమని.. ఐరోపా సమాఖ్య విదేశాంగ శాఖ చీఫ్ జోసెఫ్ బోరెల్ తెలిపారు.
జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన.. భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ భద్రతా మండలి ప్రాథమిక నిర్మాణాన్ని ప్రశ్నించారు. దీంతో పాటుగా తాము ఎల్లప్పుడూ శాంతికే మద్దతిస్తామని స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం మాత్రమే ఆచరణీయమైన మార్గమని అన్నారు. ఈ సమావేశం ఏర్పాటు వెనుకున్న లక్ష్యాలను తాము పరిగణలోకి తీసుకుంటున్నామని వెల్లడించారు. శాశ్వత శాంతిని భద్రపరచాలనే ఉద్దేశంతోనే తాము ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఇది యుద్ధయగం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను గుర్తుచేసిన ఆమె.. మనుషుల ప్రాణాలను పణంగా పెడితే సమస్యలకు ఎప్పటికీ పరిష్కారం దొరకదన్నారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ ఉక్రెయిన్ యుద్ధభూమి నుంచి రష్యా బలగాలు వెనుదిరగడానికి ఇదే అనువైన సమయం అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. 'ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి సంవత్సరం ముగిసింది. అంతర్జాతీయ సమాజానికి ఇదో భయంకరమైన మైలురాయిగా నిలిస్తుంది. రష్యా ఐక్యరాజ్యసమితి చార్టర్ చట్టాలను ఉల్లంఘిస్తుంది' అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో 75కు పైగా దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, దౌత్యవేత్తలు ప్రసంగించారు.
భారత్ ఎప్పుడూ శాంతివైపే
భారతదేశం ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ చట్టాలను భారత్ గౌరవిస్తుందని పునరుద్ఘాటించారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకు తీరని నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహారం, ఇంధనం, ఎరువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ సమస్యలతో కష్టపడుతున్న దేశాల పక్షాన భారత్ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలపై రష్యా ఉద్దేశపూర్వకంగానే దాడి చేస్తుందని అన్నారు.
12 అంశాలతో చైనా స్పెషల్ ప్రతిపాదన
రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ జరగాలని చైనా పిలుపునిచ్చింది. శాంతి చర్చలను ప్రారంభించిన చైనా.. వివాదాన్ని ముగించడానికి 12 అంశాలను ప్రతిపాదించింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో చైనా తటస్థంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పశ్చిమ దేశాలే వివాదాన్ని రెచ్చగొట్టాయని ఆరోపించింది. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తొలిగించాలని, పౌరులను తరంలిచడానికి కారిడార్‌లు ఏర్పాటు చేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా ధాన్యం ఎగుమతులపై ఏర్పడిన అంతరాయలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇది ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు కావాలని పేర్కొంది.