UNSC meeting on terrorism sanctions: ఐరాసలోని భద్రతా మండలిలో ఉగ్ర ఆంక్షల కమిటీ తీరుపై భారత్ మండిపడింది. ఉగ్రవాదాన్ని అందరూ ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలని పేర్కొంది. ఐరాసలోని ఆంక్షల విధానాలపై నమ్మకం ఎన్నడూ లేనంతగా పతనమైందని విమర్శించింది. చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల విషయంలో సంస్థ పనితీరును భారత్ పరోక్షంగా తప్పుపట్టింది. ఐరాస సెక్రటేరియట్ ఉగ్రవాదం అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది.
'ఉగ్రవాద చర్యలతో అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు' అనే అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారత దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ ప్రసంగించారు. ఉగ్రజాబితాలపై పట్టు సాధించడం కోసం చైనా చేసే ప్రయత్నాలను, ఉగ్రవాదాన్ని కీర్తించే పాకిస్థాన్, ఉగ్ర సంస్థలకు ఆశ్రయం కల్పించే అఫ్గానిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. ప్రపంచలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాదుల వివరాలను ఆధారాలతో సహా ఇచ్చినా.. ఆ పేర్లను బ్లాక్ లిస్ట్‌లో చేర్చకుండా ఆపడం బాధాకరమని భారత్ పేర్కొంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు భద్రతా మండలి ఆంక్షల విధానాలపై నమ్మకాన్ని దిగజారుస్తాయని పేర్కొంది.
ఉగ్రవాదంపై ఐరాస సెక్రటరీ జనరల్ నివేదికను భారత్ తప్పుపట్టింది. మధ్య, దక్షిణాసియాలో కేవలం ఐఎస్‌ఐఎల్-కె ఉగ్రసంస్థను మాత్రమే ఆ నివేదికలో ప్రస్తావించడంపై రుచిరా మండిపడ్డారు. ఈ ప్రాంతంలో చాలా గ్రూపులు ఉన్నా.. పట్టించుకోలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకొనే గ్రూపులను ప్రస్తావించలేదన్నారు. కేవలం ఎంపిక చేసిన సమాచారాన్నే ఈ నివేదిక కోసం తీసుకున్నారని ఆరోపించారు. భారత ఉపఖండంలో లష్కరే-జైషే మధ్య ఉన్న బంధం ఎంత ప్రమాదకరంగా మారిందో వంటి అంశాలను భారత్ ప్రస్తావించింది.