మనిషి పుట్టుకకు మూలాధారమైన మహిళలపై హింస అంతకంతకూ పెరిగిపోతోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. నవంబరు 25న 'మహిళలపై హింస నివారణ దినం' సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన కలిగించే విషయాన్ని వెల్లడించారు. ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతోందని చెప్పారు.
కొవిడ్ 19 మహమ్మారి, ఇతర ఒత్తిడి కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులవ్వడం వల్ల ఆడవాళ్లు, ఆడపిల్లలపై శారీరక హింస, తిట్లు పెరిగాయని గుటెర్రస్ వివరించారు. ఇది తీవ్రమానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు జాతీయ కార్యాచరణను అమలు చేసి, ఈ దారుణాలకు అడ్డుకట్టవేయాలని కోరారు. శ్రద్ధా వాకర్ దారుణ హత్య యావద్దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిన సమయంలోనే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఈ విషయాలను వెల్లడించారు.
ఆన్‌లైన్ ద్వారాను మహిళలు, బాలికలు హింసను ఎదుర్కొంటున్నారని.. స్త్రీ ద్వేషంతో అసభ్యపదజాలంతో దూషణ, లైంగిక దాడులు, ఫొటోల మార్పిడి వంటి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు.. గుటెర్రస్ చెప్పారు. ఈ చర్యలన్నీ మహిళలు, బాలికల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను నిరాకరించడమేనని ఆయన చెప్పారు. మహిళలు, బాలికలపై హింసకు ముగింపు పలికే పరివర్తనకు సమయం ఆసన్నమైందని ప్రపంచ దేశాలకు గుటెర్రస్ పిలుపునిచ్చారు.