Russia out from UNHRC: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. వారాల తరబడి పోరాడినా.. రాజధాని కీవ్‌లోకి అడుగు పెట్టలేకపోయిన పుతిన్ సేనలు అక్కడి నుంచి తిరుగుముఖం పట్టాయి. ఉక్రెయిన్ సైనికులతో పోరాడలేక ఆ దేశంలోని మరిన్ని ప్రాంతాల నుంచి వెనుతిరుగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రభుత్వ స్థైర్యాన్ని దెబ్బతీసేలా.. తూర్పు ప్రాంతంపై భీకర దాడులకు రష్యా సిద్ధమవుతున్నట్టు భావిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు అమెరికా తదితర దేశాల రక్షణ శాఖల నిఘా వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించే తీర్మానంపై సర్వప్రతినిధి సభలో గురువారం ఓటింగ్ జరిగింది. మెజార్టీ దేశాలు మద్దతు పలకడంతో ఈ ప్రక్రియ దాదాపు ఖరారైనట్టేనని భావిస్తున్నారు.
పౌరుషముంటే.. యుద్ధం ఆపమనండి- జెలెన్స్కీ:తూర్పు ప్రాంతంలో భీకర దాడులు చేపట్టేందుకు రష్యా వ్యూహాలు రచిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. ‘‘బుచా ప్రాంతంలో యుద్ధ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. పుతిన్ సేనలు అమాయక ఉక్రెయిన్ పౌరులను అత్యంత అమానవీయంగా హింసిస్తున్నాయి. రష్యన్లకు ఏమాత్రం పౌరుషమున్నా... యుద్ధాన్ని ఇక్కడితో ఆపాలని వారు డిమాండ్ చేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు. కీవ్ శివారు ప్రాంతాలు, చెర్నిహైవ్‌ల నుంచి సుమారు 24 వేల మంది సైనికులు బెలారస్, రష్యాలకు వెనుతిరుగుతున్నట్టు నివేదికలు అందాయి. డాన్‌బాస్ ప్రాంతంలో రష్యన్ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నారు. వీరి సాయంతో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా యోచిస్తోంది.
డాన్‌బాస్ నుంచి వెళ్లిపోండి:పుతిన్ సేనలు డాన్‌బాస్‌ను తదుపరి లక్ష్యంగా చేసుకుంటున్నాయని, అక్కడి ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోవాలని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరించారు. రష్యా దాడులు చేయడానికి కొన్ని రోజులు పడుతుందని, ఈలోగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. ఆ తర్వాత తాము ఏమీ చేయలేమని ఉప ప్రధాని ఇరినా వెరెష్‌చుక్ పేర్కొన్నారు. కీవ్, చెర్నిహైవ్ తదితరచోట్ల రష్యా సైన్యం భారీగా దెబ్బతిందని, సేనలను సమీకరించి ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై దాడులు చేయడానికి కొంత సమయం పట్టవచ్చని రష్యా నిఘా అధికారి ఒకరు పేర్కొన్నారు.
చెల్లాచెదురుగా మృతదేహాలు:ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేసిన పలు ప్రాంతాల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రాజధాని కీవ్‌కు వెలుపల రోజుల తరబడి పడి ఉన్న శవాలను సిబ్బంది సేకరిస్తున్నారు. మేరియుపొల్‌లో ఇప్పటివరకూ మరణించిన పౌరుల సంఖ్య 5 వేలు దాటినట్టు స్థానిక మేయర్ వెల్లడించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. రష్యా దాడుల ధాటికి మేరియుపొల్‌లోని మౌలిక సదుపాయాలు 90% ధ్వంసమయ్యాయి.