ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్‌ను.. తమ దేశంలో రష్యా విలీనం చేసుకోవడాన్ని ఐరాస తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఆ ప్రాంతాలను ఉక్రెయిన్‌కు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా రష్యా విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐరాస ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. 193 మంది సభ్యులున్న ఐరాసలో 143 దేశాలు.. తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. రష్యా, బెలారస్, ఉత్తరకొరియా, సిరియా, నికరాగ్వా తీర్మానానికి వ్యతిరేకంగా ఓట్లు వేశాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండడం వల్ల తీర్మానం ఆమోదం పొందింది.
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంలో భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధం తీవ్రతరం కావడం పట్ల భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతుందని ఐరాస శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు.
అంతకుముందు సోమవారం జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను మాస్కో చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండిస్తూ.. అల్బానియా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై రికార్డెడ్ ఓటింగ్ నిర్వహించాలని కోరింది. కానీ రష్యా మాత్రం ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది. మాస్కో డిమాండ్‌కు వ్యతిరేకంగా భారత్ సహా 107 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఓటు వేశాయి.
రష్యాకు అనుకూలంగా 13 దేశాలు ఓటు వేయగా.. 39 దేశాలు ఓటింగ్‌కు దూరమయ్యాయి. వీటిల్లో రష్యా, చైనా కూడా ఉన్నాయి. ఈ పరిణామాలపై ఐరాసలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిల్లీ నెబెన్జియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐరాస సభ్యత్వం భారీ మోసానికి చిహ్నంగా మారిందని వ్యాఖ్యానించారు. అధ్యక్ష స్థానంలోని వ్యక్తి ఇందుకు కీలక సూత్రధారి అని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి తమకు అవకాశం ఇవ్వలేదని వాలిల్లీ విమర్శించారు. సభ్యదేశాలు స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పే హక్కును దోచుకొన్నారని మండిపడ్డారు.
గత నెల 30న ఉక్రెయిన్‌పై సైనికచర్య సందర్భంగా స్వాధీనం చేసుకున్న దొనెత్స్క్ , లుహాన్స్క్ , జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయి. క్రెమ్లిన్ లో జరిగిన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో విలీనమైందని తెలిపారు. విలీన ఒప్పందంపై దొనెత్స్క్ , లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలకు చెందిన అధినేతలు సంతకాలు చేశారు. గత నెల 23 నుంచి 27 వరకు నిర్వహించిన రెఫరెండంలో అత్యధికులు విలీనానికి మద్దతు తెలిపినట్లు మాస్కో ప్రకటించింది. జపోరిజియాలో 93శాతం, ఖేర్సన్ లో 87 శాతం, లుహాన్స్క్ లో 98 శాతం, దొనెత్స్క్ లో 99శాతం మంది ప్రజలు రష్యాలో విలీనానికి అనుకూలంగా ఓటేసినట్లు మాస్కో వెల్లడించింది.
ఇవీ చదవండి:మొత్తం 26 ఏళ్లు జైలులోనే.. సూకీకి మరో కేసులో శిక్ష
'స్పేస్‌లో ఉన్నా.. రాగానే మన పెళ్లి!'.. కేటుగాడి బుట్టలో పడ్డ మహిళ.. రూ.25లక్షలు పోయాక..