ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రపంచంలో పెరుగుతున్న ఆహారం కొరత కారణంగా మున్ముందు ప్రపంచ దేశాలు తీవ్ర విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం బెర్లిన్‌లో జరిగిన సదస్సులో సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కాగా.. ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా గుటెర్రెస్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, పెరుగుతున్న అసమానతల కారణంగా ఇప్పటికే కోట్ల మంది ప్రజలు ప్రభావితం కాగా.. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసిందన్నారు. 2022లో మరిన్ని కరవు కాటకాలు సంభవించే అవకాశం ఉందని.. 2023 ఏడాది కూడా ఘోరంగా ఉండొచ్చని హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ఇంధన ధరలు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని.. దీంతో ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో పంటలు దెబ్బతింటాయని గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆహార లభ్యతలో ఏర్పడే సమస్యలు వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు దారితీయొచ్చన్నారు. ఇలాంటి విపత్తులతో సంభవించే సామాజిక, ఆర్థిక ప్రభావం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదని గుటెర్రెస్ పేర్కొన్నారు. పేద దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల్ని నిలబెట్టుకొనేలా, ప్రపంచ ఆహార మార్కెట్లను స్థిరీకరించేందుకు దోహదం చేసేలా ప్రైవేటు రంగానికి రుణ ఉపశమనం కలిగించాలని పిలుపునిచ్చారు.