ఫొని తుపాను విధ్వంసాన్ని తట్టుకుని నిలబడినందుకు భారత్‌ను ఐరాస ప్రశంసించింది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన కచ్చితమైన సమాచారం, హెచ్చరికలే.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సాయపడ్డాయని పేర్కొంది ఐరాస విపత్తు విభాగం. ఫొని విధ్వంసాన్ని కచ్చితంగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తతో ప్రాణనష్టాన్ని తగ్గించటంలో సఫలమయ్యారని కితాబిచ్చింది.
"భారత వాతావరణ శాఖ కచ్చితమైన ముందస్తు హెచ్చరికలు చేసింది. అందువల్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటంలో అధికారులు సఫలమయ్యారు. 10 లక్షలకు పైగా ప్రజలను సహాయక శిబిరాలకు చేర్చారు. ముందస్తుగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విమానాశ్రయాలు, రవాణా వ్యవస్థను నిలిపేశారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. మౌలిక వసతులు దెబ్బతిన్నా ప్రాణనష్టం తప్పింది." - డెనిస్ మెక్‌క్లీన్, యూఎన్‌ఐఎస్‌డీఆర్ ప్రతినిధి.
ఫొని.. 20 ఏళ్లలో అత్యంత తీవ్రమైన తుపాను అని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 175 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ప్రచండ గాలులు ఒడిశాను అతలాకుతలం చేశాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 12 మంది మరణించారు.