యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డ ఓ సైనికుడి ఛాతి నుంచి లైవ్ గ్రెనేడ్‌ను సురక్షితంగా బయటకు తీశారు వైద్యులు. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన జవాను ఛాతిలో ఓ గ్రెనేడ్ ఇరుక్కుంది. ఏ క్షణంలో అయినా పేలే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఆండ్రీ వెర్బా అనే ఆర్మీ డాక్టర్ అతడికి వైద్యం చేసేందుకు ముందుకు వచ్చారు. సర్జరీ చేసి అతడి ఛాతిలో ఉన్న లైవ్ గ్రెనేడ్‌ను తొలగించారు. శస్త్ర చికిత్స సమయంలో ఆ బాంబు పేలకుండా ఉండేందుకు నిపుణులైన ఇద్దరు సైనికుల సహాయం తీసుకున్నారు.
డాక్టర్ చేతిలో లైవ్ గ్రెనేడ్ అసాల్ట్ రైఫిల్‌కు జతచేసిన ఓ గ్రెనేడ్ లాంఛర్ ద్వారా ఈ బాంబును ప్రత్యర్థులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇది దూసుకొచ్చి జవాన్ శరీరంలోకి చొచ్చుకెళ్లింది. కాగా, ఆపరేషన్ విజవంతమైన విషయాన్ని ఉక్రెయిన్ ఆర్మీ సోషల్ మీడియాలో వెల్లడించింది. సైనికుడి ఛాతిలో ఇరుక్కున్న లైవ్ గ్రెనేడ్‌కు సంబంధించిన ఎక్స్‌రే, సర్జరీ తర్వాత ఛాతి నుంచి బయటకు తీసిన లైవ్ గ్రెనేడ్‌ను డాక్టర్ పట్టుకున్న ఫొటోను కూడా విడుదల చేసింది. ఈ డేరింగ్ ఆపరేషన్ చేసినందుకు డాక్టర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సైనికుని ఛాతిలో ఇరుక్కున్న లైవ్ గ్రెనేడ్ ఎక్స్‌రే "గుండెకు జరిగే ప్రతి గాయం ప్రాణాంతకం కాదు! ఓ జవాన్ శరీరం నుంచి లైవ్ గ్రెనేడ్‌ను తొలగించేందుకు సైనిక వైద్యులు ఆపరేషన్ చేశారు. సర్జరీ సమయంలో బాంబు పేలకుండా ఉండేందుకు ఇద్దరు నిపుణులైన సైనికుల సమక్షంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ధైర్యంగా వైద్యం చేసేందుకు ముందుకు వచ్చిన వైద్యుల భద్రతకు ఈ విధంగా భరోసాను కల్పించారు. ఎలెక్ట్రోకోగ్యులేషన్ లేకుండా అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు ఆండ్రీ వెర్బా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ సర్జరీ విజవంతంగా పూర్తయింది. ఆ సైనికుడు పూర్తిగా కోలుకునేందుకు పునరావాస కేంద్రానికి తరలించారు" అని ఉక్రెయిన్ రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి హన్నా మలియార్ మంగళవారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.
సర్జరీ సందర్భంగా ఉష్ణాన్ని ఉపయోగించి రక్తస్రావాన్ని అరికట్టే ప్రక్రియను ఎలెక్ట్రోకోగ్యులేషన్ అంటారు. దెబ్బతిన్న కణాలను తొలగించేందుకు సైతం ఈ ప్రక్రియను చేపడతారు. అయితే ఈ ప్రక్రియ చేస్తే.. ఉష్ణం వల్ల గ్రెనేడ్ పేలిపోయే ప్రమాదం ఉందని భావించిన వైద్యులు.. ఎలెక్ట్రోకోగ్యులేషన్ను వదిలిపెట్టారు.