తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాపై రష్యా గుర్రు.. రెచ్చగొట్టొద్దని హెచ్చరిక.. ప్రత్యక్ష యుద్ధ ప్రమాదం! - రష్యా అమెరికా యుద్ధం

ఉక్రెయిన్‌కు మరిన్ని అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై రష్యా మండిపడింది. పశ్చిమదేశాలు-రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధ ప్రమాదాన్ని ఇది పెంచిందని హెచ్చరించింది. అత్యంత తీవ్ర పరిణామాలకు దారి తీసే రెచ్చగొట్టే చర్యలను అమెరికా మానుకోవాలని హితవు పలికింది. అమెరికా తీసుకున్న నిర్ణయం సుదీర్ఘ రక్తపాతం, కొత్త మరణాలకు దారి తీస్తుందని తెలిపింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Oct 5, 2022, 5:42 PM IST

ఉక్రెయిన్‌కు మరిన్ని అత్యాధునిక రాకెట్‌ వ్యవస్థలు సహా ఆయుధాలు పంపాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై రష్యా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. రష్యా, పశ్చిమ దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధ ప్రమాదాన్ని ఇది మరింత పెంచిందని మాస్కో హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపాలని అమెరికా తీసుకున్న నిర్ణయం రష్యాకు తక్షణ ముప్పుగా అమెరికాలోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ అభివర్ణించారు. యుద్ధంలో నేరుగా అమెరికా భాగస్వామిగా మారిందని విమర్శించారు. అమెరికా తీసుకున్న నిర్ణయం సుదీర్ఘ రక్తపాతం, కొత్త మరణాలకు దారి తీస్తుందని అన్నారు. అత్యంత తీవ్ర పరిణామాలకు దారి తీసే రెచ్చగొట్టే చర్యలను అమెరికా మానుకోవాలని హెచ్చరించారు.

రష్యా ఆక్రమించిన కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకున్న వేళ.. ఆ దేశానికి మరిన్ని ఆయుధాలు పంపేందుకు అమెరికా సిద్ధమైంది. కొత్తగా 625 మిలియన్‌ డాలర్ల సైనిక సాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా రాయబారి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తంగా ఉక్రెయిన్‌కు అమెరికా ఇప్పటివరకు 17 బిలియన్‌ డాలర్ల సైనిక సాయం అందిస్తోంది.

గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌ ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ సైన్యం ఎదురుదాడి ఉద్ధృతం చేసింది. రష్యా ఆక్రమించిన అనేక ప్రాంతాలకు విముక్తి కలిగించింది. దొనెట్స్క్, జపోరిజియా, లుహాన్స్క్‌, ఖేర్సన్‌ ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించినా వాటిపై పూర్తి నియంత్రణను ఆ దేశం సాధించలేకపోతోంది. ముఖ్యంగా ఖేర్సన్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ దళాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. పశ్చిమ దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలతోనే ఉక్రెయిన్‌ సైన్యం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో అణుదాడికైనా సిద్ధమని రష్యా ఇటీవల హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details