ఏడాదికి పైగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం మంటలు ఇంకా చల్లారలేదు. దీంతో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది ఉక్రెయిన్. ఈ క్రమంలో దేశ పునర్నిర్మాణం కోసం ప్రపంచ దేశాల సహకారం కోరుతోంది ఉక్రెయిన్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే మానవతా దృక్పథంతో తమకు చేయుతనందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఈ లేఖలో పలు వైద్య పరికరాలతో పాటు ఔషధాల కొరతను తీర్చే విధంగా అదనపు మానవతా సాయం అందించాలని జెలెన్‌స్కీ అభ్యర్థించారు.
ఉక్రెయిన్ విదేశాంగ ఉప మంత్రి ఎమినే జపరోవా భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి జెలెన్‌స్కీ రాసిన లేఖను ఆమె విదేశాంగ శాఖకు అందించారు. వైద్య సామగ్రి వంటి అదనపు మానవతా సాయం అందించాలని అందులో కోరారు. అందుకు భారత్ ముందుకువచ్చిందని వెల్లడిస్తూ మన విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ట్విట్టర్లో స్పందించారు. అలాగే ఉక్రెయిన్ పునర్నిర్మాణం భారత సంస్థలకు ఓ అవకాశమని జపరోవా తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం భారత్ నుంచి ఆమె మరింత సహకారాన్ని కోరారు. మోదీ, ఇతర ఉన్నతాధికారులు తమ దేశంలో పర్యటించాలని అభ్యర్థించారు. అయితే.. ఇతర దేశాలతో భారత్‌కున్న సంబంధాల విషయంలో సూచనలు చేసే స్థితిలో తమ దేశంలేదన్నారు. రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఈ దిగుమతులు పెరిగాయి.