ఉక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్ డైరక్టర్ జనరల్ మురషోవ్‌ను రష్యన్ సైన్యం కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ స్టేట్ న్యూక్లియర్ కంపెనీ అధ్యక్షుడు పెట్రోకోటిన్ ఆరోపించారు. శుక్రవారం ఓ కారులో వెళుతున్న మురషోవ్‌ను అడ్డగించిన మాస్కో సైన్యం.. అతని కళ్లకు గంతలు కట్టి ఎత్తుకెళ్లారని పెట్రోకోటిన్ వివరించారు. వెంటనే మురషోవ్‌ను వదిలేయాలని ఆయన డిమాండ్ చేశారు. రష్యన్‌ల చర్యలతో ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆక్షేపించారు. కాగా ఈ కిడ్నాప్‌పై రష్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
జపొరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం కాగా, ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. మాస్కో తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలోనిలోని లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలను ఇటీవలే తమలో కలిపేసుకుంది రష్యా. సొంతంగా నిర్వహించిన రెఫరెండం ఫలితం తమకే అనుకూలంగా వచ్చిందని రష్యా ప్రకటించుకుంది.అయితే, తుపాకులతో బెదిరించి, ప్రజాభిప్రాయం చేపట్టారని... ఈ రెఫరెండం చెల్లదని ఐరాస ప్రతినిధులు పేర్కొన్నారు.
మాస్కో సేనలు యుద్ధంలో వెనుకబడ్డాయన్న కథనాలు వస్తున్నాయి. ఈ ఒత్తిడిలో భాగంగానే ఉక్రెయిన్‌లోని ప్రాంతాలను రష్యాలో కలిపేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ తనకంటే ఎంతో బలమైన మాస్కోకు ఎదురు నిలవడంలో అమెరికా, పశ్చిమ దేశాల సైనిక సహకారం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే.. దొనెట్స్క్, లుహాన్స్క్‌లతో పాటు జపోరిజియా, ఖేర్సన్‌లు కూడా తమ భూభాగాలేనని పుతిన్ ప్రకటించారు. వాటి జోలికి వస్తే.. అణ్వస్త్ర ప్రయోగానికీ వెనుకాడబోమని హెచ్చరించారు. తద్వారా ఆ నాలుగు ప్రాంతాల్లో తమ పట్టు నిలుపుకోవచ్చని, ఉక్రెయిన్ లేదా పశ్చిమ దేశాలు ఇక వాటిపై అంత సులభంగా దండెత్తలేవని ఆయన భావించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ నాలుగు ప్రాంతాలు బలప్రయోగంతో కాకుండా, ప్రజామోదంతోనే విలీనమైనట్టు అంతర్జాతీయ సమాజానికి చెప్పేందుకు.. ఆయా చోట్ల స్థానిక మద్దతుదారులతో రెఫరెండం నిర్వహించడం గమనార్హం. ఈ విలీన ప్రక్రియను ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా ఖండించారు. ఐరాస లక్ష్యాలకూ, మూల సిద్ధాంతాలకూ విరుద్ధమని మండిపడ్డారు.