కొద్దిరోజుల కిందట ఉక్రెయిన్ నుంచి ఎదురు దెబ్బలు తిన్న రష్యా అక్టోబరు 10 నుంచి దాడిని తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు అనేక పట్టణాలపై విరుచుకుపడుతోంది. సొంత క్షిపణులతో పాటు ఇరాన్‌లో తయారైన కామెకాజి డ్రోన్లను ఈ దాడుల్లో రష్యా వినియోగిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఇందుకుగాను ఉక్రెయిన్‌తో పాటు అమెరికా తదితర దేశాలన్నీ ఇరాన్‌పైనా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇరాన్ మాత్రం కామెకాజి డ్రోన్లను తాము రష్యాకు సరఫరా చేయలేదంటోంది. మొత్తానికి యుద్ధంలో ప్రస్తుతం కామెకాజి డ్రోన్లు ప్రధానాంశమయ్యాయి. ఎందుకంటే ఇవి... ఆత్మాహుతి డ్రోన్లు!
క్షిపణులను మోసుకుపోయి... లక్ష్యంపై సంధించగానే డ్రోన్లు తిరిగి మూలస్థానానికి చేరుకుంటాయి. కానీ కామెకాజి డ్రోన్లు అలాంటివి కావు. ఇవి ఆత్మాహుతి డ్రోన్లు. క్షిపణులతో పాటు లక్ష్యంపైకి దూసుకెళ్లి నాశనం చేస్తాయి... నాశనం అవుతాయి. మామూలుగా క్రూయిజ్ క్షిపణులను వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుపై ప్రయోగించవచ్చు. కానీ ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. అదే కామెకాజి డ్రోన్లైతే చిన్నగా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి. ఉదాహరణకు క్రూయిజ్ క్షిపణికి రష్యాకు సుమారు 10 లక్షల డాలర్లు ఖర్చయితే... ఈ కామెకాజి డ్రోన్ 20వేల డాలర్లలో వస్తుంది. లక్ష్య ఛేదనలో కచ్చితత్వమూ వీటికి ఎక్కువే.