Ukraine Russia war: రష్యాకు అత్యంత మిత్ర దేశమైన బెలారస్.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి తన రాయబార కార్యాలయాన్ని ఇటీవల ఖాళీ చేసింది. ఆ సమయంలో బెలారస్ రాయబారి ఇగోర్ సోకోల్‌కు 'అవమానకర బహుమతి' లభించింది! ఒక చెక్‌పోస్టు వద్ద ఉక్రెయిన్ సరిహద్దు గార్డు.. ఆయనపై 30 వెండి నాణేలున్న సంచిని విసిరాడు. అతడు అంత ద్వేషం వెళ్లగక్కడానికి కారణం- బెలారస్ త్వరలోనే రష్యా సైనికులతో కలిసి ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష దాడికి దిగనుందన్న బలమైన సంకేతం!
కొరకరాని కొయ్యలా మారిన ఉక్రెయిన్‌ను జయించడానికి రష్యా బలగాలు నెలరోజులకు పైగా చెమటోడుస్తున్నాయి. శత్రుగడ్డపై పుతిన్ సేనలు బలహీనపడ్డాయని, వారి ఆయుధాలు నిండుకుంటున్నాయని, ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయాయని వార్తలు వస్తున్నాయి. ప్రపంచమంతా కళ్లప్పగించి చూస్తున్న ఈ యుద్ధంలో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న పుతిన్‌కు.. ఇప్పుడు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో సాయం అనివార్యంగా కనిపిస్తోంది. బెలారస్ ప్రత్యక్షంగా యుద్ధంలో దిగనుందనీ, ఉక్రెయిన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయడమే ఇందుకు సంకేతమని మాజీ లెఫ్టినెంట్ జనరల్, ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ మాజీ డిప్యూటీ చీఫ్ ఇహోర్ రొమినెంకో విశ్లేషించారు.
ఉక్రెయిన్‌పై పైచేయి సాధించడం అంత సులభం కాదని మాస్కోకు అర్థమైంది. యుద్ధంలో సహాయంగా రావాలని అలెగ్జాండర్ లుకషెంకోపై పుతిన్ అంతకంతకూ ఒత్తిడి తెస్తున్నారు. కానీ, ప్రత్యక్ష యుద్ధానికి దిగితే బెలారస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న సందిగ్దావస్థలో లుకషెంకో ఉన్నారు
- ఉక్రెయిన్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ ఒలెక్సీ డానిలోవ్
10-15 బెటాలియన్లు:రష్యాకు తోడుగా బెలారస్ 10-15 వ్యూహాత్మక బెటాలియన్లను ఉక్రెయిన్‌లో దించనుందని, ఒక్కో బెటాలియన్‌లో 800 మంది వరకూ సైనికులు ఉండవచ్చని రొమినెంకో పేర్కొన్నారు. "ఉక్రెయిన్‌పై దాడికి బెలారస్ సైనికులు, అధికారులు అభ్యంతరం తెలపవచ్చు. అంతర్గత చర్చల తర్వాత మాత్రమే బెలారస్ తన సైన్యాన్ని రష్యా సేనలకు తోడుగా పంపగలదు. రష్యా తన రిజర్వు పారాట్రూపర్లను కూడా ఉక్రెయిన్‌లో మోహరించిన తర్వాతే అది జరుగుతుంది. పుతిన్ అంతిమ లక్ష్యమైన ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చేజిక్కించుకోవడానికే బెలారస్ సైనిక సాయం అందించే అవకాశముంది" అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు- బెలారస్ మూడు సైనిక బృందాలను ఉక్రెయిన్‌కు పంపవచ్చని, ఒక్కో బృందంలో సుమారు 5 వేల మంది సైనికులు ఉండే అవకాశముందని కీవ్‌లోని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ మేజర్ జనరల్ విక్టర్ యగూన్ పేర్కొన్నారు.
పుతిన్ చెప్పుచేతల్లో లుకషెంకో:బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోది.. పుతిన్ మాట కాదనలేని పరిస్థితి! సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత బెలారస్‌లో రెండేళ్ల కిందట భారీ తిరుగుబాటు ఎదురైంది. నాటి అధ్యక్ష ఎన్నికల్లో లుకషెంకో మట్టికరుస్తారని అంతా భావించారు. అయితే, ప్రభుత్వం తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం మోపడానికి, నిరసనలను అణచివేయడానికి మాస్కో ఇతోధికంగా సాయపడింది. అణచివేతను తాళలేక వేలమంది ఉక్రెయిన్‌కు పారిపోయి తలదాచుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో లుకషెంకో విజయం సాధించినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించినా, అది తీవ్ర వివాదాస్పదమైంది. పశ్చిమ దేశాలు ఆయన విజయాన్ని గుర్తించలేదు. ఎన్నికల్లో తీవ్రస్థాయి అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిరసనకారులను అత్యంత కిరాతకంగా అణచివేశారంటూ బెలారస్‌పై ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక, రాజకీయ తోడ్పాటుతో గట్టెక్కిన లుకషెంకో... ఇప్పుడు రష్యాకు బాసటగా నిలుస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు వీలుగా తమ భూభాగాన్ని రష్యా వినియోగించుకునేందుకు అనుమతించారు. మాస్కో తన అణ్వస్త్రాలను బెలారస్‌కు తీసుకొచ్చి ప్రయోగించేలా.. దేశ రాజ్యాంగాన్ని కూడా హుటాహుటిన సవరించారు! మొదట్లో తాము ఉక్రెయిన్‌పై యుద్ధంలోకి అడుగుపెట్టబోమని ప్రకటించిన లుకషెంకో.. ఈనెల 15న భిన్నస్వరం వినిపించారు. తమ దేశం మీదుగా క్షిపణి వెళ్లిందని, తాము కూడా దీటుగా బదులివ్వగలమని ఘాటుగా హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సరిహద్దుల వెంట బెలారస్ తన బలగాలను పెంచడం గమనార్హం. అయితే- తమ సైనిక సిద్ధపాటుకూ, ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యకూ సంబంధం లేదని బెలారస్ రక్షణశాఖ సహాయమంత్రి విక్టర్ గులేవిచ్ చెబుతున్నారు.
ఉక్రెయిన్‌కు సాయం అందకుండా:బెలారస్ దళాలు పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాల్లో రష్యా బలగాలకు నేతృత్వం వహించే అవకాశమున్నట్టు జర్మనీలోని బ్రెమెన్ యూనివర్సిటీకి చెందిన రష్యా పరిశోధనకర్త నికోలే మిత్రోఖిన్ పేర్కొన్నారు. ముఖ్యంగా లివీవ్, కోవెల్, లుట్స్క్ నగరాల్లో ఆధిపత్యం చాటుకోవడం ద్వారా.. పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉక్రెయిన్ సైనిక నిల్వలు అక్కడే ఎక్కువగా ఉన్నందున, వాటిని స్తంభింపజేయడం రష్యాకు సులభమవుతుందని మిత్రోఖిన్ విశ్లేషించారు.
బెలారస్ వద్ద 48 వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ బలగాలతో పోలిస్తే వీరి సంఖ్య తక్కువే. మాస్కో సేనలతో కలిసి పలుసార్లు సైనిక విన్యాసాల్లో పాల్గొన్నా.. ప్రత్యక్ష యుద్ధానుభవం మాత్రం బెలారస్ సైనికులకు అంతగా లేదు. ఉక్రెయిన్ మాదిరే బెలారస్ వద్ద కూడా సోవియట్ యూనియన్ నాటి ఆయుధాలు, సైనిక వ్యవస్థలు ఉన్నాయి.
ఇదీ చూడండి:రాకెట్ దాడులతో దద్దరిల్లిన లవీవ్.. ఇంధన, ఆహార నిల్వలు ధ్వంసం