తెలంగాణ

telangana

ETV Bharat / international

అణు ప్రయోగాలకు సిద్ధమైన నాటో.. రష్యాకు వెయ్యి కి.మీ దూరంలోనే! - నాటో అణు ప్రయోగం

ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడులను రష్యా తీవ్రతరం చేయడం వల్ల మరోసారి అణు హెచ్చరికలు పెరుగుతున్నాయి. రష్యా భూభాగాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి మార్గాన్నైనా ఎంచుకుంటానని అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే హెచ్చరించగా.. నాటోకూటమి అణు విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. పోటా పోటీ అణు విన్యాసాల నేపథ్యంలో సర్వత్రా అణు భయాలు కమ్ముకున్నాయి.

ukraine russia war
ukraine russia war

By

Published : Oct 13, 2022, 5:44 PM IST

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా.. అణ్వాయుధాలను ప్రయోగించనుందని వస్తున్న వార్తలతో నాటో కూటమి అప్రమత్తమైంది. దీనిలో భాగంగా వచ్చేవారం అణు విన్యాసాలు చేపట్టేందుకు నాటో కూటమి నిర్ణయించింది. అణు విన్యాసాల నేపథ్యంలో నాటో రహస్య న్యూక్లియర్ ప్లానింగ్ గ్రూప్ గురువారం సమావేశమైంది. బ్రస్సెల్స్‌లోని నాటో కూటమి ప్రధాన కార్యాలయంలో రక్షణశాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. రష్యా చేస్తున్న వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలు సమకూర్చుతామని కొన్ని నాటో సభ్యదేశాలు ప్రకటించిన నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ప్రతి ఏడాది వారం పాటు నాటో అణు విన్యాసాలు జరుగుతాయి. అణు వార్‌హెడ్లను మోసుకెళ్లే యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తడానికి ముందే ఈ విన్యాసాలు చేపట్టాలని 14 నాటో సభ్యదేశాలు నిర్ణయించాయి. ఈ విన్యాసాలు రష్యాకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో జరగనున్నాయి. నాటోకూటమికి సంబంధించిన అణ్వాయుధాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాల అధీనంలో ఉంటాయి. కానీ అణ్వాయుధాల విషయంలో స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్న ఫ్రాన్స్.. న్యూక్లియర్ ప్లానింగ్ గ్రూప్ సమావేశాల్లో భాగంగా లేదు. ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాలు ప్రయోగించినా.. రష్యాపై తాము అణ్వాయుధాలు వినియోగించమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్ స్పష్టం చేశారు. తమ సిద్ధాంతం ఫ్రాన్స్‌ ప్రాథమిక ప్రయోజనాలపై ఆధారపడి ఉందన్నారు. చర్చల ద్వారా ఇరుదేశాలు ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించుకోవాలని ఉక్రెయిన్, రష్యాలకు మేక్రాన్ విజ్ఞప్తి చేశారు.

రష్యా భూభాగాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి మార్గాన్నైనా అనుసరించేందుకు వెనుకాడమని పుతిన్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రష్యా కూడా వార్షిక అణు విన్యాసాలను నిర్వహించొచ్చని బ్రిటన్ రక్షణ శాఖ కార్యదర్శి బెన్‌ వాలెన్స్‌ తెలిపారు. ఇదే సమయంలో రష్యా కదలికలపై నాటో కన్నేసి ఉంచినా.. ఇప్పటివరకు రష్యా నుంచి ఎలాంటి మార్పు కనిపించలేదు. నాటో కూటమి అణు విన్యాసాలు చేపట్టే సమయంలోనైనా లేదా ఆ తర్వాత గానీ రష్యా అణు విన్యాసాలు జరగొచ్చని తెలిపారు. వచ్చేవారం నాటో నిర్వహించే విన్యాసాలు సాధారణంగా చేపట్టేవని పరిస్థితులకు సన్నద్ధంగా ఉండేందుకేనని వాలెన్స్‌ పేర్కొన్నారు. నాటోలోని 30 సభ్యదేశాలు కలిసికట్టుగా ఉండి.. తమపై దాడిచేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండేందుకేనని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌కు అధునాతమైన ఆయుధాలను నాటోదేశాలు అందించడంతో రష్యా అణు హెచ్చరికలు మరింత ఎక్కువయ్యాయి. అణ్వాయుధాల వినియోగంపై పుతిన్ వ్యాఖ్యలు ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా ఉన్నాయని నాటో సెక్రటరీ జనరల్ స్టోలెన్‌బర్గ్‌ గతవారం పేర్కొన్నారు. అణ్వాయుధాలు వినియోగిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని రష్యాకు స్పష్టంగా చెప్పినట్లు వివరించారు.

ఇవీ చదవండి:రష్యాకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం.. ఓటింగ్​కు భారత్ దూరం

'ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ'​.. రష్యాకు వ్యతిరేకంగా భారత్​ ఓటు!

ABOUT THE AUTHOR

...view details