Ukraine Russia War: రష్యాతో చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ బలగాలు వ్యూహాత్మకంగా శత్రుసేనలను మట్టుబెడుతున్నాయి. ఖార్కివ్ నగరంలో నదిని దాటేందుకు ప్రయత్నించిన రష్యా కాన్వాయ్‌ని ధ్వంసం చేశాయి. రష్యా బలగాలను అడ్డుకునేందుకు.. పాంటూన్ వంతెనను కూడా కూల్చివేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో చాలామంది పుతిన్ సైన్యం చనిపోవడం సహా ముఖ్యమైన ఆయుధ సామగ్రి ధ్వంసమైనట్లు బ్రిటన్ అధికారులు తెలిపారు. ఒక బెటాలియన్‌కు చెందిన దాదాపు వెయ్యి మంది రష్యా సైనికులు చనిపోయినట్లు బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది. మరోవైపు నల్ల సముద్రంలో ఒక రష్యా నౌకకు నిప్పు పెట్టినట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు పేర్కొన్నారు.
ఉక్రెయిన్ నగరాల నుంచి పుతిన్ సైన్యాన్ని జెలెన్‌స్కీ సేనలు వెనక్కి పంపుతున్నాయి. నెలక్రితం రాజధాని కీవ్ సహా ఈశాన్య ప్రాంతాల నుంచి రష్యా దళాలు వైదొలిగిన తర్వాత ఉక్రెయిన్‌లోనే రెండో పెద్ద నగరమైన ఖార్కివ్ నుంచి వేగంగా వెనక్కి తరుముతున్నాయి. ఖార్కివ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న డొనెట్స్ నది ఒడ్డున ఉన్న ప్రాంతమంతా ఉక్రెయిన్ అధీనంలో ఉన్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ ధ్రువీకరించింది.