Russia Ukraine News: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ దిగివస్తున్నారు. తమతో యుద్ధాన్ని రష్యా విరమించి, తక్షణం శాంతి నెలకొనేలా చూడాలని ఆయన గట్టిగా పట్టుపడుతున్నారు. ఎలాంటి కాలహరణం లేకుండా ఇది జరగాలని, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ముఖాముఖి భేటీ జరిగితేనే యుద్ధం ముగుస్తుందని మరోసారి పేర్కొన్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య మరోవిడత ముఖాముఖి చర్చలు మంగళవారం జరగనున్న నేపథ్యంలో సోమవారం రష్యా వార్తాసంస్థలకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ విషయం వెల్లడించారు. నాటో కూటమిలో చేరే ప్రయత్నాలు చేయబోమని నేరుగా చెప్పకపోయినా ఆ అర్థం వచ్చేలా.. తాము తటస్థంగా ఉంటామని చెప్పారు. భద్రత విషయంలో రష్యాకు హామీ ఇస్తామని చెప్పారు. సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడం తమ ప్రాధాన్యాంశమన్నారు. అణ్వస్త్ర రహిత దేశంగా ఉండేందుకు కూడా సంసిద్ధత వ్యక్తపరిచారు. (‘పుతిన్‌తో ఒక ఒప్పందం కుదరాలి. అది జరగాలంటే ఆయన తనంతట తాను కదిలివచ్చి నన్ను కలవాలి’ అని జెలెన్‌స్కీ చెప్పారు. ఆ వ్యాఖ్యను రష్యాలో ప్రచురించకుండా ఆ దేశం దానిని తొలగించింది.) రష్యా సేనలు వైదొలగిన తర్వాత ఉక్రెయిన్ ప్రజల నుంచి అభిప్రాయసేకరణ (ఏ కూటమిలోనూ చేరకూడదనే విషయంలో) చేస్తామని జెలెన్‌స్కీ తెలిపారు. గత నెల 24న దురాక్రమణ మొదలు కావడానికి ముందు ఏ ప్రాంతాల్లో రష్యా సేనలు ఉన్నాయో తిరిగి అక్కడకు వెళ్లిపోవాలని, అప్పుడే రాజీ సాధ్యమని చెప్పారు. ఒప్పందంలోని కీలకాంశాలపై ముందుగా మాట్లాడుకున్న తర్వాతే రెండు దేశాల అధ్యక్షుల భేటీ సాధ్యమవుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ చెప్పారు. ముఖ్యమైన అంశాలకు పరిష్కారంపై స్పష్టత రావాలన్నారు. చర్చల నిమిత్తం రష్యా ప్రతినిధి బృందం ఇస్తాంబుల్ చేరుకుంది.
Russia Ukraine Crisis:ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా సేనల దాడులు కొనసాగాయి. ఉక్రెయిన్ ప్రతిదాడులతో తీవ్రంగా దెబ్బతినడంతో అవి ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. తూర్పు డాన్‌బాస్ ప్రాంతాన్ని పరిరక్షించడంపై తామిప్పుడు దృష్టి కేంద్రీకరించినట్లు రష్యా తెలిపింది. కీవ్ శివార్లలోని ఇర్పిన్‌కు రష్యా దళాల నుంచి విముక్తి లభించిందని అక్కడి మేయర్ ప్రకటించారు. కీవ్‌లో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం అయ్యాయి.