ఉక్రెయిన్‌పై చేసిన యుద్ధ నేరాలకు తప్పకుండా రష్యాను శిక్షించాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో జెలెన్‌స్కీ వర్చువల్‌గా ప్రసంగించారు. రష్యాలో పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్లు పుతిన్ ప్రకటించడాన్ని తప్పుపట్టిన జెలెన్‌స్కీ... చేసిన నేరాలకు రష్యా శిక్షను అనుభవించాలని డిమాండ్ చేశారు. ఈ యుద్ధంలో మాస్కో చేసిన నేరాలను విచారించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందజేయడం, ప్రపంచ వేదికపై రష్యాను శిక్షించడం వంటి అంశాలతో కూడిన ఓ శాంతి ప్రతిపాదనను ఆయన వెల్లడించారు. ఐరాస భద్రతా మండలిలో రష్యాకు వీటో అధికారాన్ని తొలగించాలని ప్రపంచ దేశాలను ఆయన కోరారు. రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఐకమత్యం ప్రదర్శించాలని కోరారు.
"ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా నేరం జరిగింది. దీనిపై శిక్షకు మేము డిమాండ్ చేస్తున్నాం. మా దేశ సరిహద్దులకు వ్యతిరేకంగా నేరం జరిగింది. మా దేశ ప్రజల ప్రాణాలకు వ్యతిరేకంగా నేరం జరిగింది. మా దేశంలోని మహిళలు, పురుషుల గౌరవానికి వ్యతిరేకంగా నేరం జరిగింది. ఐక్యరాజ్యసమితి విలువలకు వ్యతిరేకంగా నేరం జరిగింది. మా దేశంపైకి దండెత్తిన రష్యాను శిక్షించడానికి ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ఆ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను మేము రూపొందించాం. ఆ ప్రతిపాదనలను అన్ని దేశాల ముందు ఉంచాం. ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోంది. ఐరోపా శాంతిని కోరుకుంటోంది. ప్రపంచం మెుత్తం శాంతిని కోరుకుంటోంది. కానీ మనం యుద్ధాన్ని కోరుకుంటున్న ఒకే ఒక్క వ్యక్తిని చూస్తున్నాం"
--జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు