Ukraine Power Station Attack: ఉక్రెయిన్‌పై భీకర దాడులతో విరుచుకుపడుతున్న రష్యా.. సరికొత్త యుద్ధ తంత్రాలకు తెరతీసింది. సైనిక సమరంలో తలొగ్గని ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఆత్మాహుతి డ్రోన్‌లతో ఉక్రెయిన్ మౌలిక వసతులను ధ్వంసం చేస్తోంది. రష్యా దాడికి ఉక్రెయిన్‌లో మూడింట ఒక వంతు ప్రజలు గాఢాంధకారంతో కొట్టుమిట్టాడుతున్నారు.
యుద్ధ తంత్రం మార్చిన రష్యా.. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు.. గాఢాంధకారంలో ఉక్రెయిన్! - ఉక్రెయిన్ రష్యా వార్ న్యూస్
కొరకరాని కొయ్యగా మారిన ఉక్రెయిన్‌ను దారికి తెచ్చుకోవాలని యత్నిస్తున్న రష్యా.. దారుణ వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రత్యర్థి మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులకు తెగబడుతోంది. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా మాస్కో బలగాలు చేస్తున్న దాడులతో.. ఉక్రెయిన్‌లో గాఢాంధకారం అలుముకుంది. కటిక చీకట్లలో ఉక్రెనియన్లు భారంగా కాలం వెళ్లదీస్తున్నారు.
ఉక్రెయిన్‌లో శీతాకాల ప్రభావాన్ని పసిగట్టిన పుతిన్ సేనలు.. ప్రత్యర్థి విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులకు పాల్పడుతోంది. కీవ్, జటోమీర్, దినిప్రో, జపోరిజియాలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తోంది. తాజాగా జరిపిన మాస్కో బలగాలు జరిపిన ముప్పేట దాడితో.. జటోమీర్‌లో 2లక్షల యాభై వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కీవ్‌లోనూ 50వేల మంది అంధకారంలో నలిగిపోతున్నారు. గాఢాంధకారం అలుముకున్న దినిప్రోలో ఎంతమేర నష్టం జరిగిందో అధికారులు ఇంకా అంచనా కూడా వేయలేకపోయారు. తక్షణం మరమ్మతులు చేపట్టినా కోలుకోవడానికి రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. కనీస వసతులకు నీరు లేక ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరా లేక పిల్లలు వృద్ధులకు అత్యవసర వైద్యసేవలు నిలిచిపోయాయి. పాఠశాలలు, వ్యాపారాలు సహా అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి.
సైనిక పోరాటంలో చావుదెబ్బతింటున్న రష్యా సైన్యం ఆత్మరక్షణ పనిలో పడింది. సైనిక సమీకరణకు దేశం నుంచి కూడా వ్యతిరేకత వస్తోందని గ్రహించిన మాస్కోధీశుడు పుతిన్.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. సైనిక నష్టాన్ని పూరించే పనిలో ఇరాన్ నుంచి తెచ్చుకున్న ఆత్మాహుతి డ్రోన్‌లను మాస్కో బలగాలు యుద్ధంలో ఉపయోగిస్తున్నాయి. గగనతల పోరాటంలో ఉపయోగించే ఎస్-300లాంటి క్షిపణులతో.. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచే రష్యా బలగాలు.. ఉక్రెయిన్ పవర్‌ప్లాంట్లపై దాడులు చేస్తున్నాయి. అమాయక ప్రజలే లక్ష్యంగా పుతిన్ సేనలు.. అమానుష దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. పుతిన్‌తో ఎలాంటి చర్చలు జరపేదే లేదని స్పష్టం చేశారు.