Ukraine news: ఉక్రెయిన్‌పై సైనికచర్య ప్రారంభించిన దాదాపు రెండునెలల తర్వాత రష్యా కీలక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంటు మినహా మరియుపోల్ నగరం పూర్తిగా తమ వశమైనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ ప్రకటన చేశారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో భేటి అయిన పుతిన్.. మరియుపోల్ విమోచనం కోసం చేపట్టిన సైనికచర్య విజయవంతం కావటం గొప్ప విషయమని ప్రశంసించారు. అక్కడి పారిశ్రామికప్రాంతంపై దాడులు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని పుతిన్ అన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్‌పై దాడులకు బదులు ఈగ కూడా తప్పించుకోలేనంతగా బ్లాక్ చేయాలని సైన్యాన్ని ఆదేశించారు. భారీ వైశాల్యంతో ఉన్న ఆ ప్లాంట్‌లో సుమారు 2వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు గతంలో రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. స్టీల్ ప్లాంట్‌లోని ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని.. వారికి ఎలాంటి హాని చేయకుండా వైద్యసాయం అందిస్తామని రష్యా హామీ ఇచ్చింది.
మరియుపోల్‌లో చిక్కుకున్న ప్రజలను తరలించేందుకు మానవతా కారిడార్ కింద బస్సులను పంపుతున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 4బస్సులు మరియుపోల్ నుంచి బయలుదేరినట్లు ఉక్రెయిన్ ఉపప్రధాని తెలిపారు. కనికరం లేని రష్యా దాడుల్లో వేలాది మంది చిక్కుకొన్నారని పేర్కొన్నారు. రష్యా వశం కావటంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. లుహాన్స్క్ నగరంపైనా పుతిన్ సేనలు పట్టు సాధించాయి. ఇప్పటివరకు 60శాతానికిపైగా ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.