Ukraine news: గత 63 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. పలు నగరాల్లో పుతిన్ సేనలు మరింతలా రెచ్చిపోతూనే ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటివరకు 24వేల మందికి పైగా సైనికుల్ని కోల్పోయినా రష్యా వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, ఖర్కివ్ ..తదితర ప్రాంతాలపై దాష్టీకాలను కొనసాగిస్తూనే ఉంది. తమ లక్ష్యం సామాన్య పౌరులు కాదు.. సైన్యమే టార్గెట్ అంటూ యుద్ధం ఆరంభించిన పుతిన్ సేనలు.. ఉక్రెయిన్‌లోని మహిళలు, చిన్నారులనూ వదలడం లేదు. దాదాపు 400 లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడమే ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు సృష్టిస్తోన్న అరాచకానికి నిదర్శనం. రష్యా సైనికులపై దాదాపు 400లకు పైగా అత్యాచార కేసులు నమోదైనట్టు ఉక్రెయిన్ అంబుడ్స్‌మెన్ లియుడ్‌మైలా డెనిసోవా వెల్లడించారు. లైంగిక హింసకు సంబంధించి నివేదించేందుకు హాట్‌లైన్ ఏర్పాటు చేయగా.. ఏప్రిల్ 1 నుంచి 14 మధ్య కాలంలో తమ కార్యాలయానికి దాదాపు 400లకు పైగా లైంగిక హింసకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని ఆమె తెలిపారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు.
24,200 మంది రష్యా సైనికులు మృతి:రష్యా సేనల్ని ఉక్రెయిన్ బలగాలు దాటుగా తిప్పికొడుతున్నాయి. గత 63 రోజలుగా కొనసాగుతున్న యుద్ధంలో 24,200 మందికి పైగా రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా 185 విమానాలు, 155 హెలికాప్టర్లు 939 ట్యాంకులు, 2342 సాయుధ శకటాలు, 76 ఇంధన ట్యాంకులు, 8 నౌకలు సహా భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసి రష్యాను దెబ్బతీసినట్టు పేర్కొంది.