Ukraine leader Zelenskyy: ఉక్రెయిన్‌పై గత కొన్ని రోజులుగా విరుచుకుపడ్డ రష్యా దాడుల తీవ్రతను కాస్త తగ్గించింది. లుట్స్క్ ప్రాంతంలోని ఆయిల్ డిపోపై రష్యా వైమానిక దళాలు క్షిపణి దాడికి తెగబడినట్లు వాయవ్య ఉక్రెయిన్ గవర్నర్.. వొలిన్ ఆరోపించారు. బెలారస్ భూభాగం నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు టెలిగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఉక్రెయిన్ లుహాన్స్క్ ప్రాంతంలోని రుబిజ్నే పట్టణంపై రష్యా దళాలు మరోసారి కాల్పులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఓ పౌరుడు మృతి చెందినట్లు స్థానిక గవర్నర్ సెర్హీ హేడే వెల్లడించారు. డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా చేసిన ఐదు దాడులను తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి. ఈ ప్రాంతాల్లో రెండు రష్యన్ ట్యాంకులు, పదాతిదళాల వాహనం, ఒక కారును ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. రష్యా వైపు ప్రాణ నష్టం జరిగినట్లు తెలిపాయి. చోర్నోబైవ్కాలోని వ్యూహాత్మక విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రష్యన్ దళాలు 12వసారి కూడా విఫలమైనట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
స్థానిక ప్రజల తిరుగుబాటుతో చెర్నోబిల్ పట్టణంగా పిలిచే స్లావిచ్ ప్రాంతాన్ని రష్యా సేనలు వీడినట్లు స్థానిక మేయర్ వెల్లడించారు. రష్యా తన సేనలను కీవ్ నుంచి ఉపసంహరించుకుందని ఉక్రెయిన్ మిలటరీ తెలిపింది. తమ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో రష్యా దళాలు వెనక్కి వెళ్లినట్లు ఉక్రెయిన్ మిలటరీ వెల్లడించింది. కీవ్‌లో ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ ద్వారా తరగతులు ప్రారంభం అయ్యాయి. రష్యా ఆధీనంలోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు ఉక్రెయిన్ ఉన్నతాధికారి లియుడ్మిలా డెనిసోవా తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున రేడియో ధార్మిక కిరణాలు ఆకాశంలో కలుస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
తూర్పు డాన్‌బాస్ రీజియన్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంపై రష్యా దృష్టిసారించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా సైనిక చర్య కారణంగా ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు 564.9 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి యూలియా స్వెరెదెంకో వెల్లడించారు. 8 వేల కి.మీ.ల రోడ్లు, కోటి చదరపు మీటర్ల విస్తీర్ణం మేర గృహాలు ధ్వంసమయ్యాయని వివరించారు. ఇప్పటివరకు 38 లక్షలకుపైగా ప్రజలు ఉక్రెయిన్‌ను వీడారని ఐరాస శరణార్థుల ఏజెన్సీ-యూఎన్‌హెచ్‌సీఆర్ వెల్లడించింది. వారిలో 90 శాతం మంది మహిళలు, చిన్నారులేనని తెలిపింది. 22 లక్షలకుపైగా పౌరులు పోలాండ్‌లోకి ప్రవేశించారన్న యూఎన్‌హెచ్‌సీఆర్.. రొమేనియాలోకి అయిదు లక్షలు, మాల్డోవా, హంగేరీల్లోకి మరో మూడు లక్షలకుపైగా ఉక్రెనియన్లు వెళ్లారని వివరించింది.