Ukraine Crisis: ఐరోపా ఖండంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. స్వీడన్, ఫిన్లాండ్ దశాబ్దాల తరబడి తటస్థంగా ఉన్నా.. ప్రస్తుత రష్యా చర్యలతో భయపడి నాటోలో చేరేందుకు సిద్ధమయ్యాయి. అయితే.. ఇప్పుడు టర్కీ వాటి చేరికను అడ్డుకొనేందుకు యత్నాలు మొదలుపెట్టింది. నాటో కూటమిలో చేరాలంటే ప్రతిఒక్క సభ్యదేశం ఆమోదముద్ర వేయాల్సిందే. దీంతో టర్కీ ఓటు కూడా అత్యంత కీలకం. ఇక నాటో ఇతర సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు ఫిన్లాండ్, స్వీడన్‌లు తమలో చేరాలని ఆశిస్తున్నాయి.
బేరాలకు వాడుకొనేందుకు ..?:ఫిన్లాండ్, స్వీడన్ దేశాల నుంచి నాటోలో చేరిక దరఖాస్తును ఖాయం చేస్తూ ప్రకటన వెలువడగానే టర్కీ స్పందించింది. ఆ దేశ అధ్యక్షుడు ఎర్డగాన్ స్పందిస్తూ.. నాటోలో ఆ దేశాల చేరికపై తమకు అభ్యంతరాలున్నట్లు తేల్చిచెప్పారు. "మేము స్వీడన్, ఫిన్లాండ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాం. దానికి అనుకూలంగా లేం" అని పేర్కొన్నారు.
ఫిన్లాండ్, స్వీడన్ దౌత్యవేత్తలు తనని కలిసేందుకు టర్కీ వస్తున్నారని తెలుసుకొని మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. "వారు సోమవారం ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఒప్పించేందుకు యత్నించనున్నారా..? క్షమించండి.. వారు అంత శ్రమతీసుకోవాల్సిన అవసరం లేదు" అని వ్యాఖ్యానించారు. ఎర్డగాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా.. ఆ రెండు దేశాలకు నాటో ద్వారాలను టర్కీ ఇప్పటి వరకు పూర్తిగా మూసివేయలేదు.
ఇటీవల టర్కీ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ తాము నాటోలో ఫిన్లాండ్, స్వీడన్‌ల చేరికను వీటో చేస్తామని చెప్పలేదన్నారు. తమ మద్దతు లభించాలంటే కొన్ని షరతులను పూర్తిచేయాలని ఆయన కోరారు. టర్కీ ఉగ్రసంస్థలుగా భావిస్తున్నవాటికి మద్దతు ఇవ్వకూడదని.. దీంతోపాటు టర్కీపై విధించిన ఎక్స్‌పోర్ట్ బ్యాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆ ఉగ్ర సంస్థలు ఏమిటి..?:స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు కుర్దీస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) సభ్యులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఎర్డగాన్ ప్రభుత్వం దీనిని ఉగ్రసంస్థగా అభివర్ణిస్తోంది. కుర్దు తెగకు చెందిన వారు ఏర్పాటు చేసిన గెరిల్లా గ్రూపు పీకేకే . ఇది కొన్ని దశాబ్దాల నుంచి టర్కీ విడిపోయేందుకు వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
1997లో పీకేకేను అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించింది. కానీ, సిరియాలో ఐసిస్‌పై యుద్ధంలో భాగంగా అమెరికా, స్వీడన్‌లు పీకేకేకు మద్దతు ఇచ్చాయి. 2021 ఫిబ్రవరిలో అమెరికా తీరును టర్కీ తప్పుపట్టింది. ఇది జరిగిన రెండు నెలల తర్వాత అంకారలో స్వీడన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. 2019 నుంచి టర్కీకి ఆయుధాల ఎగుమతులను స్వీడన్, ఫిన్లాండ్ నిలిపివేయడంపై అభ్యంతరాలు చెప్పింది. వెంటనే దానిని తొలగించాలని కోరింది.
2016లో టర్కీలోని ప్రభుత్వంపై జరిగిన తిరుగుబాటులో ఇస్లామిక్ ఆధ్యాత్మికవేత్త ఫేతుల్లా గుల్లియన్, ఆయన అనుచరుల హస్తం ఉందని ఎర్డగాన్ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వారిలో కొందరు ఫిన్లాండ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వారిని అప్పజెప్పాలని ఎర్డగాన్ సర్కారు కోరనుంది. దీంతోపాటు పీకేకే, గుల్లియన్ గ్రూపులకు చెందిన మరో 21 మందిని స్వీడన్ నుంచి అప్పజెప్పాలని డిమాండ్ చేయనుంది. ఇప్పటికే దాదాపు డజను సార్లు ఈ రెండు దేశాలను టర్కీ అభ్యర్థించగా.. అవి తిరస్కరించినట్లు బీబీసీ కథనంలో పేర్కొంది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా విషయంలో టర్కీ కఠిన వైఖరి అవలంభించలేదు. ఎస్-400 కొనుగోళ్లు వంటి అంశాల కారణంగా ఇరు దేశాల సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య రాజీయత్నాల్లో చురుగ్గా పాల్గొంది. ఈ నేపథ్యంలో నార్డిక్ దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వడాన్ని ప్రతిఘటిస్తే.. రష్యాతో దూరం మరింత పెరగకుండా ఉండే అవకాశం ఉంది.
ఎర్డగాన్ స్వార్థం కూడా కొంత..:ఎర్డగాన్ పాలనలో టర్కీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దీనికి తోడు ఆయన సంప్రదాయ ఆర్థిక విధానాలు అవలంభించడంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా 2023 అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డగాన్‌కు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకొని జాతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చి.. సంప్రదాయ ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పీకేకేను తెరపైకి తెచ్చి డిమాండ్లు చేస్తున్నారు.
పెద్దన్న అమెరికా మద్దతుతో నార్డిక్ దేశాల ఆశలు సజీవం..:స్వీడన్, ఫిన్లాండ్‌కు సభ్యత్వం ఇవ్వాలంటే నాటోలోని 30 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందే. దీంటో టర్కీ దీన్ని అడ్డుకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు నార్డిక్ దేశాలు టర్కీతో చర్చలు మొదలుపెట్టాయి. మరోపక్క నాటోలో అతిపెద్ద భాగస్వామి అయిన అమెరికా ఈ దేశాల సభ్యత్వానికి మద్దతు ఇస్తోంది. దీనిపై అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కరెన్ డాన్‌ఫ్రైడ్ మాట్లాడుతూ "స్వీడన్ అప్లికేషన్‌ను టర్కీ వ్యతిరేకిస్తోందా.. నాకు స్పష్టత లేదు" అని పేర్కొన్నారు. దీనికితోడు శ్వేతసౌధం ప్రతినిధి జెన్ సాకీ కూడా నార్డిక్ దేశాలకు అమెరికా మద్దతుపై స్పష్టతనిస్తూ.."వారు కూటమిలో చేరికపై నాటో సభ్యుల్లో అత్యధిక మంది నుంచి మద్దతు లభిస్తోంది. టర్కీ అభిప్రాయంపై స్పష్టత తీసుకొనేందుకు బైడెన్ కార్యవర్గం పనిచేస్తోంది" అని పేర్కొన్నారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఇటీవల ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడుతూ టర్కీ విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎర్డగాన్‌తో బేరాలాడటానికి ఆస్తికి లేదని వెల్లడించారు. ఆ రెండు దేశాలకు సత్వర సభ్యత్వంపై నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్‌బర్గ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:నాటోలో చేరాలని స్వీడన్ నిర్ణయం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!