Ukraine Crisis: బుచా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని నగరం. ఇప్పుడు అక్కడ ఏ వీధిలో చూసినా శవాల దిబ్బలే. ఎడాపెడా దాడుల్లో భాగంగా రష్యా ఆ నగరంపై విరుచుకుపడిన తీరుకు నిదర్శనంగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. రష్యా దళాలు ఉపసంహరించుకున్న తర్వాత అక్కడకు వెళ్లగలిగినవారి హృదయాలు ద్రవిస్తున్నాయి. ఒకేచోట దాదాపు 300 మంది సాధారణ పౌరుల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. వీటిల్లో ఓ పసిబిడ్డ మృతదేహం కూడా ఉంది. ఇది ఉద్దేశపూర్వక మారణకాండ అని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా ఆదివారం పేర్కొన్నారు. వీధుల్లో దొరికిన చాలా మృతదేహాలను చూస్తే.. ప్రజల్ని నేలపై పడుకోబెట్టి, చేతుల్ని వెనక్కి కట్టి తలవెనక భాగాన కాల్చినట్లు తెలుస్తోందని మేయర్ అనతోలి ఫెడొరక్ చెప్పారు. మృతుల్లో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలిపారు. సురక్షిత ప్రాంతానికి తరలిపోయే ప్రయత్నంలో ఉన్నవారినీ రష్యా సైనికులు పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా నుంచి మార్చి 31న ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి. ధ్వంసమైన రష్యా యుద్ధ ట్యాంకులతో అక్కడి వీధులు బీభత్సంగా కనిపిస్తున్నాయి.
మొదటి నుంచి భీకర పోరు..ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైన తర్వాత రష్యా సేనలు కీవ్ దిశగా వేగంగా వచ్చినా తొలి ప్రతిఘటన బుచాలో ఎదురైంది. ఇక్కడ ఉక్రెయిన్ దళాలు రష్యా సైనిక వాహనశ్రేణిపై ఎదురుదాడి చేశాయి. దీనిలో వాహనశ్రేణి మొత్తం ధ్వంసమైంది. కీవ్ చుట్టుపక్కల అత్యంత భీకర పోరు జరిగిన ప్రాంతం ఇదే. బుచా నుంచి కీవ్ వైపు వెళ్లే మార్గంలో ఓ చోట రోడ్డు ఇరుకుగా, పొడవుగా ఉంది. దీంతో మాటువేసి ప్రత్యర్థిపై దాడి చేయడానికి ఉక్రెయిన్ దళాలకు సులభమైంది. దాడిలో 100 యూనిట్ల రష్యా సాయుధ సామగ్రి ధ్వంసమైంది. బుచా-ఇర్పిన్ మధ్య ఉన్న ఓ వంతెనను కూడా ఉక్రెయిన్ దళాలు పేల్చేశాయి. దీంతో రష్యా దళాలు ముందుకుసాగలేకపోయాయి. పట్టువదలని రష్యా సేనలు దాడులను తీవ్రతరం చేస్తునే ఉన్నాయి. బుచాతో పాటు పలు ఇతర నగరాల్లోనూ సాధారణ పౌరుల ప్రాణాలను బలితీసుకుంటున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ సహా అనేక దేశాలు రష్యాను తప్పుపట్టాయి. బుచాపై ఉక్రెయిన్‌ది దుష్ప్రచారమని రష్యా ఖండించింది. ఇవన్నీ కల్పితాలని తోసిపుచ్చింది.