Ukraine Crisis: రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో మరో కీలక అడుగు వేసేందుకు పావులు కదుపుతున్నారు. తన ఉక్కుపిడికిలిలో బంధించిన ప్రాంతాలను రష్యాలో శాశ్వత భాగాలుగా మార్చేసేందుకు యత్నాలు చేస్తున్నట్లు పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఉక్రెయిన్ తూర్పుభాగంపై తన పట్టును బిగించేందుకే ఈ ప్రయత్నాలని అమెరికా ఇంటెలిజెన్స్ సోమవారం హెచ్చరించింది. ఖెర్సాన్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన పోరాటం జరుగుతున్నా.. రష్యా ఈ ప్రయత్నాల్లో ఉండటం విశేషం. ఈ మేరకు తమకు నమ్మకమైన సమాచారం అందిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. 2014లో క్రిమియాను ఆక్రమించుకొన్న తర్వాత కూడా రష్యా ఇదే వ్యూహాన్ని అనుసరించింది.
అమెరికా నిఘా సంస్థలు ఏం చెబుతున్నాయి:అమెరికా సంస్థల కథనం ప్రకారం.. రష్యా మే నెల మధ్యలో డొనెట్స్క్, లుహాన్స్క్ లేదా ఖెర్సాన్ ప్రాంతాల్లో ఓ రెఫరెండం (ప్రజాభిప్రాయసేకరణ) చేపట్టనుంది. ఉక్రెయిన్‌ను వీడి రష్యాతో కలిసేందుకు అక్కడి ప్రజల మద్దతు ఉందని చెప్పేందుకే ఈ చర్యలు చేపట్టనుంది. దీంతోపాటు తనకు నమ్మకమైన వ్యక్తులను అక్కడి పాలకులుగా పుతిన్ నియమించే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి ఈ ఓటింగ్ అనేది ఓ ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం విలీనం చేసుకొన్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి వ్యూహాలను రష్యా అనుసరించడం కొత్తేమీ కాదని అమెరికా ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ కోఆపరేషన్ ప్రతినిధి మిషెల్ కార్పెంటర్ వెల్లడించారు. ఇప్పటికే రష్యా ఆక్రమణ విషయంలో అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల అంచనాలు తప్పలేదని ఆయన పేర్కొన్నారు. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో కనుక రెఫరెండం నిర్వహిస్తే చర్చలకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయినట్లేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవలే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సమస్య మరింత చిక్కుముడులు పడే అవకాశం ఉంది.
గతాన్ని గమనిస్తే..?:ఉక్రెయిన్‌పై ఆక్రమణ ప్రకటించిన ఫిబ్రవరి 24కు రెండు రోజుల ముందు డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను కీవ్ నుంచి విడిపోయిన స్వతంత్ర భాగాలుగా మాస్కో గుర్తించింది. ఆ తర్వాత అక్కడ శాంతి నెలకొల్పేందుకంటూ పీస్ కీపింగ్ దళాలను పంపింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రకటించింది. మరోపక్క ఖెర్సాన్ పట్టణాన్ని ఆక్రమించిన తర్వాత రష్యా అక్కడ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి యత్నాలు చేసింది. ఉక్రెయిన్ కరెన్సీని నిలిపి రూబుల్స్ చలామణి చేయడానికి యత్నాలు మొదలుపెట్టింది. దీనిపై 'ది అట్లాంటిక్ కౌన్సిల్' సభ్యుడు డెనియల్ ఫ్రెడ్ మాట్లాడుతూ రెఫరెండం వంటి చర్యలను ఐరోపా దేశాలు యుద్ధానికి ముగింపుగా భావించి సహిస్తాయని పుతిన్ అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, బుచాలో నరమేధం వంటివి చూశాక పుతిన్ ఆక్రమణను పశ్చిమదేశాలు అంగీకరించవని పేర్కొన్నారు.