Ukraine Chernobyl plant: ఉక్రెయిన్‌లో భీకర దాడులకు తెగబడుతోన్న రష్యా సేనలు అక్కడి చెర్నోబిల్ ప్లాంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే.. అప్పటి నుంచి సైనిక బలగాల కదలికలతో అక్కడ భారీ స్థాయిలో రేడియేషన్ విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అది అసాధారణ స్థాయికి చేరుకొని అత్యంత ప్రమాదకరంగా మారిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) హెచ్చరించింది.
'చెర్నోబిల్‌లో రేడియేషన్ స్థాయిలో అసాధారణంగా ఉన్నాయి. రష్యా బలగాలు భారీ పరికరాలను ఇక్కడకు తరలిస్తూ.. మళ్లీ తీసుకువెళ్లే సమయంలో రేడియేషన్ స్థాయిలు మరింత పెరుగుతుండడం గమనించాం. నిత్యం వీటి పరిస్థితులను అంచనా వేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఇవి అత్యంత ప్రమాదకరంగా మారాయి' అని చెర్నోబిల్ ప్లాంటు సందర్శన అనంతరం ఐఏఈఏ డైరెక్టర్ రాఫేల్ గ్రోస్సీ వెల్లడించారు. అయితే, న్యూక్లియర్ ప్లాంట్ చుట్టూ ఉన్న డెడ్ జోన్ లోపలికి రష్యా బలగాలు ట్యాంక్‌లతో వెళ్లడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తినట్లు అనుమానిస్తున్నారు.